అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.. గృహ నిర్బంధాలు.. ప్రతి కదలికనూ పసిగట్టేందుకు చుట్టూ వేగులు.. ఎక్కడి వారి అక్కడే ముందస్తు అరెస్టులు.. అయినా ఆ బంధనాలన్నీ ఛేదించిన యువజన, విద్యార్థి సంఘాల నాయకులు ముఖ్యమంత్రి ఇంటి సమీపానికి చేరుకోగలిగారు. తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి తదితర 10 సంఘాలు సోమవారం తలపెట్టిన ‘సీఎం ఇంటి ముట్టడి’ ఉద్రిక్తతలకు దారితీసింది. జాబ్‌లెస్ క్యాలెండర్ పక్కనపెట్టి దాని స్థానంలో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్న డిమాండుతో నిరసన తెలిపేందుకు వచ్చిన వివిధ సంఘాల ప్రతినిధులు, నిరుద్యోగ యువత బారికేడ్లు దాటుకుని సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. తాడేపల్లిలోని పాత టోల్‌గేట్ కూడలి, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పలుమార్లు పోలీసులు, యువతకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించడం, యువత ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది.
మెరుపులా దూసుకొచ్చి...
తాడేపల్లి ప్రాంతంలో పోలీసులు ఆదివారం రాత్రి నుంచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడకు వచ్చే పొట్టిపాడు, కీసర టోల్‌గేÆట్ల వద్ద తనిఖీలు చేపట్టారు. సీఎం జగన్ ఇంటి వైపు దారితీసే అన్ని మార్గాలను ఆధీనంలోకి తీసుకుని మూసేశారు. పది కిలోమీటర్ల పరిధిలోని ప్రధాన కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేశారు. వారధి, ప్రకాశం బ్యారేజీపై భారీగా మోహరించారు. ఆ మార్గంలో వెళ్లే ప్రతి వాహనాన్ని పరిశీలించి, ప్రయాణికుల గుర్తింపు కార్డులు చూసి అనుమతించారు. తాడేపల్లి పాత టోల్‌గేట్ కూడలి నుంచి సీఎం నివాసం ఉన్న భరతమాత కూడలి వైపు ఎవరినీ అనుమతించలేదు. అయినా ఉదయాన్నే నాయకులు మంగళగిరి వైపు నుంచి జాతీయ రహదారిపైకి ప్రదర్శనగా వచ్చి ఒక్కసారిగా పాత టోల్‌గేట్ వైపు దూసుకొచ్చారు. సీఎం ఇంటి వైపు వెళ్లేందుకు యత్నించారు. అక్కడి నుంచి జగన్ నివాసం 300-400 మీటర్ల దూరంలోనే ఉంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొంతమంది బారికేడ్లు దాటుకుని వెళ్తుండగా, వారిని ఈడ్చేశారు. తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు అక్కడే బైఠాయించేందుకు యత్నించగా పోలీసులు ఈడ్చుకెళ్లారు. దాదాపు అరగంట పాటు తోపులాటలు జరిగాయి. నిరసనకారులను నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరికొన్ని బృందాలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు చేరుకుని అక్కడి నుంచి సీఎం నివాసం వైపునకు మళ్లాయి. కళాక్షేత్రం వద్దకు రాకుండా నిలువరించేందుకు ప్రకాశం బ్యారేజీ, జాతీయ రహదారి, ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డులోని ముఖ్య కూడళ్లలో పోలీసులు పహారా కాశారు. అయినా వివిధ మార్గాల్లో పెద్దసంఖ్యలో యువత చేరుకున్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి వాహనాల్లోకి ఎక్కించారు. కొందరు యువకులు తప్పించుకుని జాతీయ రహదారి మీదుగా సీఎం ఇంటి వైపు దూసుకెళ్లారు. వీరందర్నీ అరెస్టు చేసి విజయవాడలోని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు.
ఠాణాల్లోనూ ఆందోళన
నల్లపాడు స్టేషన్‌లో ఉన్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పరామర్శించేందుకు తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్, వామపక్ష నేతలు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. వారిమధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమను పరామర్శించేందుకు వచ్చిన నేతల్ని అడ్డుకుంటారా? అంటూ స్టేషన్ లోపల ఉన్న యువత ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు ఆలపాటిని లోపలికి అనుమతిచ్చారు. అరెస్టైన యువత నుంచి పోలీసులు ఫోన్లు తీసేసుకోవటంతో మరోమారు వాగ్వాదం జరిగింది. కాసేపటికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెదేపా నేత పిల్లి మాణిక్యరావు విద్యార్థుల్ని పరామర్శించేందుకు రాగా.. అనుమతించలేదు. వారు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. గవర్నర్‌పేట ఠాణా వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, వన్‌టౌన్ పోలీసుస్టేషన్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఇబ్రహీంపట్నంలో మాజీ మాంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, భవానీపురంలో కేశినేని శ్వేత ఆందోళన చేపట్టారు.
ఆకలి దప్పులకు అలమటించి..
మొత్తంగా 10 విద్యార్థి సంఘాలకు చెందిన దాదాపు 235 మందిని విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారు. కొంతమందిని సాయంత్రం విడిచిపెట్టారు. నల్లపాడు స్టేషన్‌లో ఉంచిన సుమారు 30 మంది యువతను రాత్రి 10 గంటల వరకూ విడుదల చేయకపోవడంతో ఆకలి, దప్పికలతో అలమటించారు. కొందరు నీరసించిపోయారు. స్నేహితులు, బంధువులు అల్పాహారం సమకూర్చినట్లు తెలిసింది. తమను రిమాండ్ చేసి జైలుకు పంపిస్తారా? లేకా ఇళ్లకు పంపిస్తారా? కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారా? అంటూ స్టేషన్ ఆవరణలో యువత నినాదాలు చేశారు. విడుదలకు ఉన్నతాధికారుల ఆదేశాలు రావాలంటూ పోలీసులు చెప్పడంతో ఆగ్రహించారు. పలు జిల్లాల్లోనూ విద్యార్థి, యువజన సంఘాల నేతలు, తెదేపా, వామపక్షాలకు చెందిన ముఖ్య నాయకులు విజయవాడకు చేరుకోకుండా నిలువరించేందుకు పోలీసులు వారికి ముందస్తు నోటీసులు అందించారు.
బేషరతుగా విడుదల చేయాలి: చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్‌తో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనకు దిగిన నిరుద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. విద్యార్థి, యువజన సంఘ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరమన్నట్లు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. వైకాపా ప్రభుత్వ పతనానికి నిరుద్యోగుల పోరాటమే నాంది కానుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి