Statue of Equality: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. ఆయన పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజాచార్య విరాట్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. తొలుత శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి సీఎం స్వాగతం పలుకుతారు. ఆయన వెంట హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అనంతరం ముచ్చింతల్‌కు వస్తారు. ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ ముఖ్యమంత్రి మోదీ వెంటే ఉంటారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం తరఫున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు తోమర్, కిషన్‌రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో ప్రధాని సుమారు మూడు గంటల సేపు పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేంద్రం విశిష్టతలను చిన జీయర్ స్వామి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించనున్నారు. రామానుజాచార్య విగ్రహం, యాగశాలలను ప్రధాని హెలికాప్టర్ ద్వారా విహంగ వీక్షణం చేసేలా ఏర్పాట్లు చేశారు.
5 నెలల తర్వాత పీఎంను కలుస్తున్న తెలంగాణ సీఎం
గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని, భాజపాపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పీఎం, సీఎం కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ గత ఏడాది సెప్టెంబరు మూడో తేదీన దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి రాష్ట్ర సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత వారిద్దరూ మళ్లీ ఈ కార్యక్రమాల సందర్భంగా కలవనున్నారు.
ప్రధాని పర్యటనకు పటిష్ఠ భద్రత
ప్రధాని మోదీ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. శ్రీరామనగరంలో రామానుజాచార్య విగ్రహం, సమతాస్ఫూర్తి కేంద్రం ప్రాంగణాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. ప్రధాని పర్యటించే ప్రదేశాల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. చినజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధాని పర్యటనలో 8 వేల మందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇక్రిశాట్, విమానాశ్రయం, ముచ్చింతల్‌లో కొన్ని ప్రదేశాలను సెక్టార్లుగా విభజించి సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. సమతామూర్తి ప్రాంగణంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వచ్చే రోజుల్లో కఠిన ఆంక్షలు ఉంటాయని వివరించారు. కలెక్టర్ అమోయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఇంటెలిజెన్స్ ఐజీ అనిల్‌కుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఫైర్ సర్వీస్ అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తదితరులు వారి వెంట ఉన్నారు.
పోలీసుల అధీనంలో...
శ్రీరామనగరానికి దారితీసే మార్గాలన్నిటినీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. జంక్షన్ల వద్ద అదనపు బలగాలను ఉంచారు. ప్రధాని వెళ్లే పీ1 రోడ్డులో బాంబు స్క్వాడ్, డాగ్‌స్వ్కాడ్‌లతో తనిఖీలు చేశారు. ప్రధానికి భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే ఎస్పీజీ డీఐజీ నవనీత్‌కుమార్ రెండుసార్లు సమీక్షించి సమతాస్ఫూర్తి కేంద్రం, యాగశాలలను పరిశీలించారు. ప్రాంగణం మొత్తాన్ని ఎస్పీజీ తన అధీనంలోకి తీసుకుంది. డాగ్‌స్క్వాడ్, బాంబుస్క్వాడ్‌లతో ఉదయం, సాయంత్రం విస్తృతంగా తనిఖీ చేశారు.
మోదీ పర్యటన ఇలా...
- శనివారం మధ్యాహ్నం 2.10
- శంషాబాద్ విమానాశ్రయానికి రాక
- 2.45- హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు చేరిక
- 4.30- హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు..
- 5.15- యాగశాలల సందర్శన
- 6.00- విష్వక్సేనేష్టి యాగంలో పాల్గొంటారు.
- 6.05- 6.35 దివ్యదేశాల సందర్శన
- 6.35- 6.40 రామానుజాచార్యుల సువర్ణమూర్తి సందర్శన
- రాత్రి 7.00- రామానుజాచార్యుల సువర్ణ విగ్రహావిష్కరణ, ప్రసంగం
- 7.30- 8.05- 3డీ మ్యాపింగ్ లేజర్ షో తిలకిస్తారు. తర్వాత యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు.
- 8.20- శంషాబాద్ నుంచి దిల్లీకి పయనం
ఇదీ చదవండి: