‘ఆంధ్రప్రదేశ్‌లో రూ.41వేల కోట్ల అవకతవకలు జరిగాయంటూ వారం రోజులుగా హడావుడి చేస్తున్నారు. ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కాగ్ విచారణ చేయించాలని కోరారు. ఇదంతా పాలక పక్షాన్ని ఇబ్బందులు పెట్టే ఆలోచనే. ఈ విషయంపై నేరుగా ఒక సమావేశం ఏర్పాటుచేసి మమ్మల్ని పిలిచి వివరణ కోరే హక్కు, అధికారం పీఏసీ ఛైర్మన్‌కు ఉన్నాయి. అది మానేసి ఇలా గవర్నర్‌కు ఫిర్యాదులు, దిల్లీకి లేఖలు ఎందుకు?’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ‘అకౌంటెంట్ జనరల్ కార్యాలయం లేఖను ఆయన చూపించారు. కాగ్ విచారణ చేయాలంటారు.
అసలు కాగ్‌లో అకౌంటెంట్ జనరల్ ఒక భాగమే కదా... వారి పరిశీలనలో సందేహం వచ్చే కదా ఈ లేఖ రాసింది... ఇక కాగ్ విచారణ ఏంటి? ఆడిట్ జరిగే క్రమంలో అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి అనేక సందేహాలు వస్తాయి. ప్రభుత్వాన్ని వివరణ కోరతారు. మేం సమాధానం చెబుతాం. ఆ సమాధానం చెప్పే దిశలోనే ఉన్నాం. దీనికి ఇంత హడావుడి ఎందుకు? ఇంతకుముందు ఏ బిల్లు చెల్లించినా ఉపఖజానా అధికారి సంతకం ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థను కంప్యూటరీకరించారు. సీఎఫ్‌ఎంఎస్ విధానం వచ్చింది. అందులో బిల్లు చెల్లింపునకు అధీకృతం చేసేలా ప్రోగ్రాం అంతర్గతంగా ఉండాలి. అది లేకపోవడంతో, సీఎఎఫ్‌ఎంఎస్‌లో లోపాల వల్లే... ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ విధానాన్ని తెచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం కదా?’ - మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
విజయవాడలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే...
* నిజానికి తెదేపా ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌ను ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టింది. ఏ ప్రభుత్వమైనా రోబస్ట్ ప్యాకేజీ సొంతంగా తయారు చేసుకుంటుంది. వీరు ఎస్‌ఏపీ ప్యాకేజీ తీసుకున్నారు.
* 2020-21లో రూ.10,895 కోట్లు (మొత్తం 15 బిల్లులు) పీడీ ఖాతాలకు వెళ్లింది. దానంతట అదే నమోదు కావాలి. కానీ సాంకేతిక కారణం వల్ల అది జరగలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరం చివర్లో నిధులు మురిగిపోకుండా రూ.8,860 కోట్లు పీడీ ఖాతాలకు జమ చేశాం. కార్పొరేషన్ నుంచి కార్పొరేషన్‌కు రూ.10,895 కోట్లు బదిలీ అయ్యాయి. కన్సాలిడేటెడ్ ఫండ్‌లో కార్పొరేషన్లు భాగం కాదు. అందువల్ల దానిపై సందేహాలు ఏర్పడ్డాయి. తొలుత ఈ-కుబేర్ ద్వారా రూ.2,728 కోట్లు రైతు భరోసా కింద జమ చేసినా చేరలేదు. తర్వాత ఆర్‌టీజీఎస్‌తో చేశాం. చేయూత పథకంలోనూ ఇలాంటి సమస్యే వచ్చింది. హెడ్ ఆఫ్ అకౌంట్ మార్పుల వల్ల కూడా ఇలాంటి సందేహాలు తలెత్తాయి. వాటన్నింటికీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి వివరణ పంపుతున్నాం.
అప్పు చేసి పేదలకు, రైతులకే ఇస్తున్నాం
* అప్పులు చేస్తున్నాం, తప్పేంటి? అప్పులకు పరిమితి ఉంది, ఆ లోపే చేస్తున్నాం. 2019-20 నుంచి ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. కరోనాతో పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచంలో ఎవరు అప్పులు చేయలేదు? మేం అప్పు చేసిన సొమ్ము పొదుపు ఖాతాలకు, రైతులకు, పేదలకు, విద్యార్థులకు, ఆరోగ్యశ్రీకి ఇస్తున్నాం. తెదేపా హయాంలోనూ అప్పులు చేశారు కదా... ఆ సొమ్ములు ఏం చేశారు? పరిశ్రమలు పెడతాం అంటూ సదస్సులకు ఖర్చుచేశారు.
* కేంద్రం కూడా అప్పులు చేస్తోంది కదా? 2014-19 మధ్య కేంద్రం అప్పు రేటు 8.44%. అప్పుడు తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అది 18.36%. ప్రస్తుతం కేంద్రం అప్పుల పెరుగుదల రేటు 15.26% ఉంటే.. రాష్ట్రానిది 16%. ఎవరు ఎక్కువ అప్పులు చేసినట్లు?
* ఈ రెండేళ్లలో రూ. లక్ష కోట్లకు పైగా పేదల సంక్షేమానికే ఖర్చుచేశాం.
తెలంగాణ వాటా అప్పు మనం వాడలేదు
కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాసి 2016-17 నుంచి 2019-20 వరకు తెలంగాణ వాటా అప్పు కూడా మనం వాడుకున్నామని సందేహపడింది. వాస్తవానికి అది జరగలేదు. కేంద్రం కూడా పొరపాటు పడింది. ఆ పరిమితిని మనం వాడేసుకున్నాం అనుకున్నారు. ఆ లెక్కలూ తీశాం. 2016-17 నుంచి 2020-21 వరకు మనకు ఉన్న పరిమితి కన్నా తక్కువ రుణమే తీసుకున్నాం. అందులోనూ తెలంగాణ వాటా మినహాయించి మాత్రమే ఆ పరిమితి పొందాం. తెలంగాణ వాటా మనం వాడుకున్నామేమో అన్న కేంద్రం సందేహం సరికాదు. కేంద్రం సుమారు రూ.17,000 కోట్లకు పైగా రుణ పరిమితిలో కోత విధించడానికి తెదేపా ప్రభుత్వమే కారణం. వారు ప్రజా పద్దు నుంచి రుణం తీసుకోవడం వల్ల ఇప్పుడు రుణ పరిమితికి కోత పడింది.
ఇదీ చదవండి:
కేబినెట్ కమిటీలలో కొత్త మంత్రులకు అవకాశం
Garbage tax: రాష్ట్రంలో చెత్తపన్ను.. తొలి దశలో 45 నగరాలు, పట్టణాల్లో అమలు