కేంద్ర వాణిజ్యశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్రకటించిన ఇండస్ట్రియల్ పార్కు రేటింగ్స్ సిస్టం-2.0లో 41 పారిశ్రామిక పార్కులు ఉత్తమ పనితీరు కనబరిచి, లీడర్లుగా నిలిచాయి. ఈ జాబితాలో దక్షిణాది నుంచి శ్రీసిటీ(SRICITY) ఒక్కటే స్థానం దక్కించుకొంది.
కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్.. మంగళవారం ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో పారిశ్రామిక పార్కులు, సెజ్‌లు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, వ్యాపారపరంగా ఇస్తున్న మద్దతు, పర్యావరణం, భద్రతాపరంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న వాటికి స్థానం కల్పించారు. దాదాపు లీడర్ల జాబితాలోని పార్కులతో సమానమైన పనితీరు కనబరుస్తున్నా, వాటికంటే కాస్త తక్కువస్థాయిలో ఉన్నవాటిని ఛాలెంజర్లుగా గుర్తించారు. భవిష్యత్తులో చాలా మార్పులు చేసుకొని, పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన వాటిని యాస్పైరర్లు అని రేటింగ్ ఇచ్చారు. ఇందులో లీడర్లలో 41, ఛాలెంజర్లలో 90, యాస్పైరర్లలో 185 పార్కులు చోటు సంపాదించుకున్నాయి. లీడర్లుగా నిలిచిన 41 పార్కుల్లో నాలుగు ఉత్తర జోన్, ఒకటి దక్షిణ జోన్ నుంచి చోటు దక్కించుకోగా, మిగిలినవన్నీ మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచే ఉన్నాయి.
ఛాలెంజర్లుగా జాబితాలో నిలిచిన 90 సంస్థల్లో.. తెలంగాణలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ పార్కు, హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీలోని ఐటీ పార్కు మాదాపూర్ చోటు సంపాదించుకున్నాయి.
యాస్పైరర్ల జాబితాలో 185 పార్కులు నిలవగా అందులో.. ఆంధ్రప్రదేశ్‌లోని బ్లాక్-ఎఫ్, బొబ్బిలి గ్రోత్ సెంటర్, ఐడీఏ-పరవాడ, ఐడీపీ కడప, ఐపీ అత్తివరం, ఐపీ ఐసీ పూడి, నాయుడుపేట, పైడిభీమవరం, గంభీరం, అమ్మవారిపల్లి, ఎర్రమంచి, గాజులమండ్యం ఇండస్ట్రియల్ పార్కులు, మంగళగిరి ఐటీపార్కు, పెద్దాపురం యూడీఎల్, స్టేట్ ఫుడ్‌పార్కు, వికృతమాల ఈఎంసీ-2లు నిలిచాయి.
తెలంగాణ నుంచి ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్, చందన్‌వెల్లి, ఈసిటీ సెజ్, హార్డ్‌వేర్ పార్కు, బండమైలారం ఐపీ ఆగ్రో ప్రాసెసింగ్ పార్కు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, ఐపీ మన్‌కల్, రాంపుర్, సుల్తాన్‌పుర్ జనరల్, మెడికల్ డివైజెస్ పార్కు, మడికొండ, తూప్రాన్ ఇండస్ట్రియల్ పార్కులు, టీఎస్‌ఐఐసీ జడ్చర్ల స్థానం పొందాయి.
- ప్రత్యేక ఆర్థిక మండళ్లలో 13 లీడర్లుగా నిలవగా, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రాండిక్స్ ఇండియా అపెరెల్ సిటీ, రామ్‌కీ ఫార్మాసిటీ ఇండియా, శ్రీసిటీ సెజ్ స్థానం దక్కించుకున్నాయి.
- ఛాలెంజర్ల విభాగంలో 19 సెజ్‌లు నిలవగా, అందులో ఏపీ నుంచి అపాచీ, డాక్టర్ రెడ్డీస్ ఏపీఐస్, ఫార్మాస్యూటికల్స్, హెటిరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విశాఖపట్నం సెజ్ చోటు సంపాదించుకున్నాయి.
- యాస్పైర్స్ విభాగంలో 17 సెజ్‌లు నిలవగా, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి బీపీసెజ్, దివీస్ ఫార్మా, ప్యారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీసెజ్ హిల్ 2, 3, నాయుడుపేట సెజ్‌లు స్థానం పొందాయి. తెలంగాణ నుంచి ఫ్యాబ్ సిటీ ఎస్‌పీవీ, జడ్చర్ల సెజ్‌లు చోటు దక్కించుకున్నాయి.
- అధికంగా ఖాళీస్థలం ఉన్న పార్కుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడ, ఎర్రమంచి, గాజులమండ్యం ఉన్నాయి.
- అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కుల్లో శ్రీసిటీ, ప్రైవేటు సెజ్‌లలో బ్రాండిక్స్, డాక్టర్ రెడ్డీస్, హెటెరో, రామ్‌కీ, శ్రీసిటీ సెజ్‌లు నిలిచాయి.
- రేటింగ్స్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న 449 పార్కులు, ఎస్‌ఈజడ్‌లను నామినేట్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 18 పారిశ్రామిక పార్కులు, 14 సెజ్‌లు, తెలంగాణ నుంచి 19 పారిశ్రామిక పార్కులు, రెండు సెజ్‌లు నామినేట్ అయ్యాయి.
- పారిశ్రామిక అవసరాల కోసం ఏపీలో 6,637.55 హెక్టార్లు, తెలంగాణలో 2,017.70 హెక్టార్ల భూమి అందుబాటులో ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అన్నింటికంటే అత్యధికంగా తమిళనాడులో 21,456 హెక్టార్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. పరిశ్రమలకు అందుబాటులో ఉన్న మొత్తం స్థలంలో 83% పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పేర్కొంది.
- ఈ రేటింగ్స్ పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషాన్ని వ్యక్తంచేశారు. శ్రీసిటీ అందిస్తున్న ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, స్నేహపూర్వక వాతావరణం, సుస్థిరమైన పర్యావరణ పద్ధతులకు ఈ రేటింగ్ సాక్ష్యంగా నిలిచినట్లు పేర్కొన్నారు.
IT Raids on Hetero: హెటిరో డ్రగ్స్ కార్యాలయంతో పాటు ప్రొడక్షన్ కేంద్రాల్లో సోదాలు