Southwest monsoon: ఈసారి నైరుతి రుతు పవనాలు కాస్త ముందుగానే పలకరించే అవకాశాలున్నాయి. అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ నెల 15న ఈ సీజన్ తొలి వర్షాలు కురవొచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం తెలిపింది. మే 15కల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల 5 నుంచి 8 మధ్య నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోకి విస్తరిస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు ఐఎండీ తెలిపింది.
‘‘సాధారణంగా రుతు పవనాలు మే 15న నికోబార్ దీవులను దాటుకొని 22కల్లా అండమాన్ దీవుల్లోని ఉత్తర ప్రాంతమైన మాయాబందర్‌ను తాకుతాయి’’ అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర తెలిపారు. కేరళలోనూ రుతుపవనాలు కాస్త ముందుగానే వచ్చే పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా ఏటా జూన్ 1న రుతు పవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి.
ఇదీ చదవండి: