తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం వైఎస్ షర్మిల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆమె అనుచరుడు కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 20న హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లోని వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనంలో నియోజకవర్గ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని చెప్పారు.
ఏప్రిల్ 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతాయని రాఘవ రెడ్డి పేర్కొన్నారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, అందరి సూచనలు, సలహాలు పరిగణననలోకి తీసుకుంటామని చెప్పారు. ఇవాళ ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో షర్మిల భేటీ అయ్యారు.
తెలంగాణలో పాలన సక్రమంగా లేదని, తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని రాఘవరెడ్డి ఆక్షేపించారు. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు రాజన్న రాజ్యం కావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. షర్మిల పొత్తులకు దూరమని వైఎస్ రక్తంలోనే పొత్తు అనేది లేదని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల