SECUNDRABAD BONALU: తెలంగాణలోని సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. తెల్లవారు జామున మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. శాఖలు సమర్పించి విశేష నివేదన చేశారు. ఉదయం నుంచే దర్శనానికి భక్తులు పోటెత్తారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో ఆలయం ప్రాంగణం కోలాహలంగా మారింది. ప్రత్యేక పూజలు చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి మహంకాళీ మాతను దర్శించుకున్నారు. అంతకుముందు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి తొలి బోనం సమర్పించారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా అందర్నీ ఆహ్వానించామని తెలిపారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబసమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి కావ్యరెడ్డి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు బోనాల పండగు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి భారత్ విశ్వగురువు స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఉజ్జయినీ అమ్మవారికి హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ మెుక్కులు చెల్లించారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో 2 వేల మందితో బోనాల ర్యాలీ నిర్వహించారు. ఆదయ్యనగర్ నుంచి మహంకాళి ఆలయం వరకు చేపట్టారు. భారీ ర్యాలీగా వచ్చి అమ్మవారికి కవిత బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉజ్జయిని అమ్మవారిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాణికం ఠాగూర్, అంజనీకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రాగా పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం జరిగింది. ప్రకృతి విపత్తుల నుంచి అమ్మవారు ప్రజలను కాపాడుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయిని ఆలయ పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. భద్రతను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్... అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చదవండి: