Medaram jatara: తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభమయ్యింది. మొదటిరోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మెక్కులు చెల్లించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఇసుకేస్తే రాలనంత జనం ఉండటంతో.. పరిసరాలు కోలాహలంగా మారాయి. మేడారం పరిసరాల్లో ఎటు చూసిన గుడారాలు వెలిశాయి. భక్తి పారవశ్యంతో ఉప్పొంగుతుండగా.. కోరిన కోర్కెలు తీర్చి చల్లగా చూడాలని దేవతల్ని కోరుకుంటున్నారు.
కన్నెపల్లి ఆలయంలో సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల తర్వాత కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరింది. జంపన్న వాగు దాటి గద్దెల వద్దకు సారలమ్మ చేరుకుంది. డోలు, డప్పు వాద్యాల నడుమ ఊరేగింపుగా సారలమ్మ మేడారం చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కన్నాయిగూడెం నుంచి గోవిందరాజులు మేడారం వచ్చారు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరారు. రేపటికి సమ్మక్క... గద్దెల వద్దకు చేరుకోనుంది.