SANKRANTHI CELEBRAIONS: సంక్రాంతిని పురస్కరించుకుని... భవానీ ఐలాండ్‌లో ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సాగిన వివిధ పోటీలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, తెలంగాణ నుంచి వచ్చిన కళాకారులు ఈ పోటీలకు వచ్చి అలరించారు. చిత్రలేఖనంలో పాల్గొన్న యువత... సంక్రాంతి పల్లెదనాన్ని ఉట్టిపడేలా కళారూపాలను తీర్చిదిద్దారు. చిన్నారుల నాట్యాలు ఆద్యంతం ఆకట్టున్నాయి. తెలుగు సంప్రదాయం కళ్లకు కట్టేలా ప్రదర్శనలు నిర్వహించారు. మెుదటి రోజు జరిగిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
భవానీపురంలోని బెరం పార్కు, భవానీ ఐలాండ్ కోలాటం, డప్పు శబ్దాలు, కేరింతలతో మార్మోగింది. చివరి రోజు వేడుకలు కృష్ణా నదీ తీరాన ఏర్పాటు చేసిన వేదికపై మరింత ఆసక్తిగా సాగాయి. ఆటలు, పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షోలు ఘనంగా జరిగాయి. తెలుగుదనం ప్రతిబింబించేలా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో క్యాట్ వాక్ చేస్తూ హొయళొలికించారు. చిన్నారులు కూడా ఫ్యాషన్ షోలో పాల్గొని అలరించారు. ఉయ్యూరు నుంచి వచ్చిన డప్పు యువత కృష్ణమ్మ తీరం పులకించేలా డప్పులు వాయించారు..
తెలుగు రాష్ట్రాల్లో పండుగల్ని పల్లెదనం, ప్రాచీన కళలకు నిదర్శనంగా జరుపుకుంటారని కళాకారులు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కళలన్నీ మరుగున పడిపోతున్నాయని పండులప్పుడైన కళల్ని ఆదరించాలన్నారు. కృష్ణమ్మ అందాలు చూస్తూ పర్యాటకులు మైమరిచిపోయారు. సెల్ఫీలు తీసుకుంటూ... కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. టూరిజం శాఖ ఏర్పాట్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజులపాటు సాగిన సంక్రాంతి ఉత్సవాలు విజయవంతమైనట్లు ఏపీటీడీసీ తెలిపింది. పర్యాటక రంగానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకే వేడుకలు జరిపామని తెలిపారు.
ఇదీ చదవండి: