రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులు, బస్‌స్టాండ్లలో ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం తప్పనిసరి చేయాలని సూచించారు. కార్యాలయాల ఆవరణలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయాలన్నారు. అన్ని జిల్లాల ఆర్ఎంలు, ఈడీలతో ఈమేరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా.. సిబ్బంది, ప్రయాణికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డ్రైవర్లు, కండక్టర్లు సహా సిబ్బందికి డబుల్ లేయర్ మాస్కులు ఇవ్వాలన్నారు. బస్సుల్లో మాస్కులు లేకుండా ప్రయాణించే వారికి అక్కడిక్కడే సరఫరా చేయాలన్నారు.
బస్సులు నడపడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన మార్గాల్లో బస్సులు పెంచాలని, అనవసరమైన చోట సంఖ్యను కుదించాలని ఆదేశించారు. కొవిడ్ బారిన పడిన సంస్థ ఉద్యోగులకు 14 రోజుల స్పెషనల్ క్యాజువల్ లీవ్ ఇస్తామన్నారు. ఈ నెల 27,30 తేదీల్లో విశ్రాంత సిబ్బందికి బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. సంస్థకు టికెట్టేతర ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాణిజ్య అవకాశం ఉన్న స్థలాల్లో పెట్రోల్ బంకుల నిర్మాణం చేపట్టాలని.. ఖాళీగా ఉన్న స్థలాలు ,దుకాణాలను త్వరితగతిన ఆశావహులకు కేటాయించాలని సూచించారు.
ఇదీ చదవండి: సమగ్ర భూసర్వే: 'ఎక్కడా అవినీతికి తావుండొద్దు'