సులువుగా డబ్బు సంపాదించేందుకు పట్టపగలే దోపిడీకి పథకం వేసి పోలీసులకు చిక్కింది ఓ ముఠా. నేరం జరిగిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన లాకా మణికంఠ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.
పాత వార్త చూసి పథకం వేశారిలా..
విజయవాడ నగరంలోని మహావీర్ జైన్ ఇంట్లో కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని గత నెలలో దోచుకున్న వార్తను సామాజిక మాధ్యమాల్లో చూశాడు. నగదు కోసం దోపిడీకి పథకం వేశాడు. ఇందుకు సాయంగా.. గుంటూరు జిల్లాకు చెందిన కుంభా వీరాంజనేయులు, మేడా కల్యాణ్ అనే ఇద్దరు నిందితులను కలిపుకుని ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగా నగరంలోని గవర్నర్ పేట్ పీస్ పరిథిలో ఉన్న జైహింద్ క్లాంపెక్స్ వద్ద 15 రోజులు రెక్కీ నిర్వహించాడు.
డమ్మీ గన్ చూపి దొరికింది దోచేశారు..
సాఫ్ట్ గన్ ఇండియా అనే సైట్ నుంచి డమ్మీ తుపాకీని కొనుగోలు చేశాడు. మహావీర్ జైన్ ఇంట్లో బంగారం ఉంటుదన్న ఆశతో ఈనెల 30న.. ఉదయం 10 గంటలకు నిందితులు జైన్ ఇంటికి చేరుకున్నారు. మహావీర్ జైన్ ఇంటి నుంచి బయటకు వెళ్లగానే ఇంట్లోకి చొరబడి జైన్ భార్య, కుమారుడి కళ్లల్లో కారం చల్లి, వారిని కొట్టి, నోటికి ప్లాస్టర్ వేశారు. అరిస్తే చంపేస్తామని డమ్మీ తుపాకీతో బెదిరించారు. ఇంట్లో వెతికి చూస్తే బంగారం కనపడక పోవటంతో.. ల్యాప్ టాప్, రెండు సెల్ఫోన్లను దోచుకుని పరారయ్యారు. నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే బాధితులు సాయంకోసం కేకలు వేయటంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు.
పరారీలో పోలీసులకు దొరికారిలా..
అనుమానాస్పదంగా చేతిలో తుపాకీతో ఆటోలో పారిపోతున్న నిందితులను కానిస్టేబుల్ లోకేష్ ఆపాడు. అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే దోపిడీ గుట్టు బయటపడిందని సీపీ శ్రీనివాసులు తెలిపారు.
పాత చోరీ తరువాత రూట్ మార్చిన మహావీర్ జైన్..
గతంలో దొంగతనం జరిగిన తర్వాత నుంచి జాగ్రత్త కోసం మహావీర్ జైన్.. ఇంట్లో బంగారం నిల్వ చేయటం మానేశాడని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకోలేని నిందితులు దోపిడీకి వచ్చారని సీపీ వెల్లడించారు. నిందితుల్లో వీరాంజనేయులు అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడిగా ఉన్నట్లు అయన తెలిపారు.
నకిలీ డీజీపీ ట్విట్టర్ ఖాతాపై సీపీ దర్యాప్తు..
గుర్తుతెలియని వ్యక్తులు డీజీపీ పేరుపై నకిలీ ట్విట్టర్ ఖాతా తెరిచిన కేసుపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. ట్విట్టర్ సంస్థకు దీనిపై మెయిల్ పంపి ట్విట్టర్ ఖాతాను నిలుపదల చేసినట్లు సీపీ స్పష్టం చేశారు. డీజీపీ పేరుతో నకిలీ ఖాతాను తెరచి పోలీసులు చేసిన పనుల గురించి మెస్సేజ్‌లు పంపటంతో జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులు దానిని ఫాలో అయ్యారు. వరుసగా పోస్టులు రావటంతో అనుమానం వచ్చిన పోలీసు ప్రధాన కార్యాలయం అధికారులు ట్విట్టర్ ఖాతాను లోతుగా పరిశీలించారు. నకిలీ అకౌంట్ అని తేలటంతో దర్యాప్తు చేయాలని విజయవాడ పోలీసులకు తెలిపారు. ఈ నకిలీ ఖాతాపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టినట్లు సీపీ తెలిపారు.
ఇవీ చదవండి: