చూడచక్కని చిలకలు, కిచ్ కిచ్ మంటూ శబ్దాలు చేసే పిచుకలు, పావురాలు... ఇలా రకరకాల పక్షలను చూడాలంటే ఏం చేస్తాం. ఏ జంతు ప్రదర్శనశాలకో వెళ్తే తప్ప వాటిని చూడలేం. బెజవాడకు చెందిన దంపతులు మాత్రం నిత్యం రకరకాల పక్షులకు అతిథ్యమిస్తూ...అందులోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. తెల్లవారకుండానే మగ్గులు, పళ్లాల్లో బియ్యం, పప్పులు, వడ్లు నింపుతూ.. పక్షులకు కడుపు నింపుతున్నారు. ప్రకృతి ప్రపంచాన్ని.. తమ ఇంట్లోనే కొలువుండేలా చేస్తున్నారు.
పక్షుల కోసమే.. బాల్కానీ
విజయవాడకు చెందిన దాసరి రామకృష్ణకు ముందునుంచి ప్రకృతి అందాలను ఆస్వాదించడమంటే చాలా ఇష్టం. అందుకే ఆ ఇంట ఎప్పుడూ హరిత కాంతులు వెదజల్లే మొక్కలు పలకరిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు పటమటలో ఉండే రామకృష్ణ దంపతులు 2014లో కానూరులోని ఈ అపార్ట్మెంట్లోకి మారారు. ఓ రోజు బాల్కనీలో ఆరబెట్టిన గింజలను పక్షులు తినేశాయి. గమనించిన రామకృష్ణ మరుసటి రోజు అదే పని చేశారు.. మళ్లీ పక్షులు వచ్చాయి. అప్పటి నుంచి పక్షుల కోసమే ఆ బాల్కనీని కేటాయించేశారు. మొదట్లో పిచుకుల కోసం వడ్లు పెట్టేవారు. ఆ తర్వాత చిలుకలు రావడంతో వాటికి జామపండ్లు వంటివి పెట్టేవారు. పక్షుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో... బాల్కనీలో ఉన్న ఇనుప కిటికిలకు మగ్గులు తగిలించి... వాటిలో ధాన్యం వేయడం ప్రారంభించారు.
ఆకలి తీర్చడమే వారి పని!
సూర్యోదయంతో మెుదలైన పక్షుల రాక..విడతల వారీగా సూర్యాస్తమయం వరకు వస్తూనే ఉంటాయి. ఆకలి తీరిన పక్షి వెళ్లిపోతుంటే.. మరో పక్షి వచ్చి వాలుతుంటుంది. నిత్యం ఆ ఇంట పక్షుల కిలకిలారావాలు వినిపిస్తూనే ఉంటాయి. రామకృష్ణ అభిరుచిని గౌరవించే ఆయన సతీమణి రాజ్యలక్ష్మి సైతం ఈ పక్షులకు అతిథ్యం ఇవ్వడంలో సంతోషంగా పాలుపంచుకుంటున్నారు. రోజూ..పక్షుల ఆహారం కోసమే..ఐదు నుంచి ఆరు కేజీల బియ్యం సిద్ధం చేసుకుంటారు. బాల్కనీలో పక్షులు రాకపోకలను ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లో బంధించి....ఆ దృశ్యాలనే టీవీలో పెట్టుకుని వీక్షిస్తుంటారు ఈ పక్షి ప్రేమికులు.