Electric Vehicles Usage in AP: పెట్రోల్, డీజిల్ ధరల మోత వాహనదారులకు ఇబ్బందిగా మారింది. కూలీ నుంచి వ్యాపారి వరకు ఆదాయంలో అధిక శాతం పెట్రోల్‌కే ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్రో ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వాహనాలు వారిని అమితంగా ఆకర్షిస్తున్నాయి.
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల కొనుగోలు బాగా పెరిగింది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో వీటి కొనుగోలు అధికంగా ఉంది. ఇంటి దగ్గరే ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం, సామర్థ్యాన్ని బట్టి వేగం లాంటివి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. విద్యుత్ వాహనాలతో నిర్వహణ వ్యయం కూడా తగ్గుతోంది. మహిళలకు స్కూటీలతో పాటు... యువతకు వివిధ మోడళ్లలో బైకులూ వచ్చాయి. ఇప్పటికే యువత ఎక్కువగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేస్తోంది.
పెట్రోల్‌కు రోజుకు 300 రూపాయలు వరకు ఖర్చయ్యేదని.. విద్యుత్ వాహనం ద్వారా ఈ ఖర్చు తగ్గించుకున్నామని వినియోగదారులు అంటున్నారు. విద్యుత్ వాహనాలతో అనేక ప్రయోజనాలున్నా.. ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండకపోవడం, ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం సమస్యే. ధరలు ఎక్కువగా ఉండటం, బ్యాటరీలు అధిక మన్నిక లేకపోవడం కూడా సమస్యగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తే ప్రజలు మరింత ఎక్కువగా విద్యుత్ వాహనాల కొనుగోలుకు మెుగ్గుచూపుతారని షోరూం నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : She Auto stand: తిరుపతిలో మహిళా డ్రైవర్ల కోసం ప్రత్యేక ఆటోస్టాండ్లు