కరోనా ప్రభావంతో దేవాలయ అర్చకులు, పురోహితుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణలో 3680 గ్రామీణ ప్రాంత పురాతన దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద ప్రభుత్వం నెలకు రూ.6 వేలు అందిస్తోంది. దేవాదాయ శాఖ పరిధిలోకి రాని ప్రైవేటు దేవాలయాలపై ఆధారపడిన అర్చకులు, శుభకార్యాలు జరిపించే పురోహిత కుటుంబాలు, వాటిపై ఆధారపడిన ఇతర కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
సుముహూర్తాలకు లాక్‌డౌన్.. అనంతరం మూఢాలు
ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శుభకార్యాలకు ముహూర్తాలున్నా, లాక్‌డౌన్‌తో ఆటంకమేర్పడింది. జులై నెల అనంతరం భాద్రపదం శూన్యం, ఆశ్వయుజ మాసం అధిక మాసం కావడంతో ముహూర్తాలు ఉండవు. కార్తికమాసం (నవంబరు)లో ముహూర్తాలు ఉన్నా, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు గురుమౌఢ్యమి కారణంగా శుభకార్యాలు నిర్వహించరు. దీంతో ఈ సంవత్సరమంతా పురోహితులకు పనులు ఉండవు.
"అర్చకులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఈ కఠిన సమయంలోనూ ధూపదీప పథకం కింద ఉన్న ఆలయాల్లో పనిచేసే వారికి గౌరవ వేతనం అందిస్తున్నారు. కానీ శుభకార్యాలు చేసే పురోహితుల పరిస్థితి దారుణంగా ఉంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహకారం అందించడానికి కృషి చేస్తున్నాం." - దౌలతాబాదు వాసుదేవశర్మ, రాష్ట్ర ధూపదీప ఆలయ అర్చక సమాఖ్య అధ్యక్షుడు
ఆదుకునే వారేరి?
పట్టణాల్లో అద్దె ఇళ్లలో ఉంటూ పౌరోహిత్యంలో సహాయకులుగా పనిచేసే చిన్న పురోహిత కుటుంబాలు రాష్ట్రంలో సుమారు 20 వేల వరకు ఉంటాయి. ఒక్క భాగ్యనగరంలోనే సుమారు 10 వేల కుటుంబాలున్నాయి. ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్యగోచరం. 1992 ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రామాల్లో ఆదాయం లేని 22 వేల దేవాలయాలు ఉన్నట్లు అంచనా (1992 తర్వాత ఈ తరహా లెక్కలు సేకరించలేదు). వాటిలో ప్రస్తుతం 3,680 దేవాలయాలకు ధూపదీప పథకం వర్తింపజేశారు. మిగతా ఆలయాల్లోని అర్చకులకు భక్తుల ఆదరణే శరణ్యం. ఆలయాలకు భక్తులు రాక, పూజలు లేక వీధిన పడిన వీరు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. శుభకార్యాలపై ఆధారపడిన ఇతర కుటుంబాల (మంగళవాయిద్యాలు, పూలు అమ్మేవారు, టెంట్‌హౌస్, ఫొటోగ్రాఫర్లు, వస్త్ర వ్యాపారులు, వంటవారు)కూ ఇది గడ్డుకాలమే.
ఇదీ చదవండి: కరోనా గుప్పిట్లో బెజవాడ.... ఎస్ఐకి పాజిటివ్