- కరోనా నేపథ్యంలో ఇటీవల వర్క్ ఫ్రమ్ హోం బాగా పెరిగిపోయింది. చాలా కంపెనీలు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించాయి. అయితే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే కొంతమంది ఉద్యోగులు తాము పనిచేస్తోన్న సమయంలో ఫొటోలు దిగి ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో పోస్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయకూడదు. ఎందుకంటే.. కొన్ని కంపెనీలు తమ సంస్థకు చెందిన సమాచారాన్ని ఇతరులకు తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఇలా ఫొటోలు పోస్ట్ చేయడం వల్ల సంస్థ గోప్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది మీ ఉద్యోగ భద్రతకు ముప్పు తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
- సాధారణంగా ఇంట్లో ఉండి పనిచేస్తే కొంతమంది ఉద్యోగుల్లో ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. అందులోనూ తమను ఎవరూ చూడట్లేదు కదా అనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో చాటింగ్‌లు చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయకూడదు. ప్రత్యేకించి ఇంటి నుంచి పని చేసే సమయంలో మీ స్నేహితులు, బంధువులతో మీరు చేస్తోన్న పని తాలుకు వివరాలు చెప్పకూడదు. ఇది ఆఫీసు నుంచి పనిచేసినా వర్తిస్తుంది.
- ఆఫీసులో చోటుచేసుకునే పరిణామాల గురించి కానీ.. ఆఫీసుకు సంబంధించి మీ జట్టు సభ్యులు చర్చించుకునే వ్యక్తిగత విషయాలను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయకూడదు. ఇది కేవలం ‘వర్క్ ఫ్రం హోం’కు మాత్రమే కాకుండా ఆఫీసులో పనిచేసినా వర్తిస్తుందని మర్చిపోకండి.
- పైన చెప్పినట్లుగా ఆఫీసు పనికోసం కేటాయించే సమయంలో సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండకండి. బహుళ జాతి కంపెనీలు ఉద్యోగి ఎప్పుడు ఏం చేస్తున్నాడే దానిపై ఓ కన్నేసి ఉంచుతాయి. ఆఫీసు పనివేళల్లో ఇతర వ్యాపకాల్లో ఉంటే అది ఉద్యోగ భద్రతపై ప్రభావం చూపే అవకాశముంటుంది.
- ఒకవేళ మీరు మీ కంపెనీకి సోషల్ మీడియా మేనేజర్‌గా పనిచేస్తుంటే. ఆఫీసు పని కోసం ఉపయోగించే బ్రౌజర్‌లో మీ వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్‌ను ఓపెన్ చేయడం మంచిది కాదు. దీనివల్ల వ్యక్తిగత అకౌంట్‌లో పోస్ట్ చేయాల్సిన దాన్ని పొరపాటున ఆఫీసు అకౌంట్‌లో పోస్ట్ చేసే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
- అలాగే మీరు మీ సంస్థకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ల బాధ్యత వహిస్తున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేకించి కరోనా కల్లోలానికి సంబంధించిన అనధికార వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు.
ఇదీ చదవండి: