2016.. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో రూ.45కోట్ల విలువైన 231 కిలోల యాంపిటోమైన్ దొరికింది. బెంగళూరులోని కెమికల్ పరిశ్రమలో పనిచేసే రీసెర్చ్ సైంటిస్ట్ వెంకట రామారావును అరెస్టు చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కేంద్రంగా మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నట్టు ఎన్‌సీబీ అధికారులు నిర్ధారించారు.
2020.. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో రూ.63.1లక్షల విలువైన 31 కిలోల మెఫిడ్రిన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన శ్రీనివాసరావును అరెస్టు చేశారు. ఏడాదిలో 100 కిలోల మెఫిడ్రిన్ తయారు చేసి వివిధ రాష్ట్రాలకు చేరవేసినట్టు దర్యాప్తులో గుర్తించారు.
హైదరాబాద్ కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ ఏడాది 4 ప్రాంతాల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు జరిపారు. రూ.2 కోట్ల విలువైన 4.926 కిలోల మెఫిడ్రిన్(Mephedrone drug) స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బండారు హనుమంత్‌రెడ్డి, సురేష్‌రెడ్డి కోసం వెతుకుతున్నారు. కీలక సూత్రధారి సురేష్‌రెడ్డికి ఫార్మా రంగంలో అనుభవం ఉందని, ఎలాంటి మత్తు పదార్థమైనా తయారుచేసే(Pharma researchers manufactures Drugs) సత్తా ఉన్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. 2017లో జీడిమెట్లలో ఖాయిలా పడిన పరిశ్రమను లీజుకు తీసుకుని భారీగా మాదక ద్రవ్యాలు తయారు చేసినట్టు అనుమానిస్తున్నారు.
విద్యావంతులు..
పరిశోధకులు కొందరు తక్కువ సమయంలో డబ్బు సంపాదనకు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. ఫార్మా పరిశోధకులు కొందరు మత్తు పదార్థాల తయారీలో(Pharma researchers manufactures Drugs) మునిగితేలుతున్నారు. గతేడాది మాదక ద్రవ్యాల కేసులో ఎన్‌సీబీ అధికారులకు చిక్కిన ఓ నిందితుడు ప్రముఖ ఫార్మా కంపెనీలో ఉన్నతోద్యోగి. సంస్థ ఫార్ములాను బయటి సంస్థలకు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఉద్యోగం నుంచి తొలగించారు. నాచారంలో మూతపడిన ఓ ఫార్మా పరిశ్రమను లీజుకు తీసుకుని మెఫిడ్రిన్ తయారీ ప్రారంభించాడు. సరకును బెంగళూరు, చెన్నైలకు చేరవేస్తూ ఆర్జించాడు. డీఆర్‌ఐకి చిక్కి జైలుకెళ్లాడు. వైమానిక దళ విశ్రాంత వింగ్ కమాండర్ 200 కిలోల యాంపిటోమైన్ సరఫరా చేస్తూ ఎన్‌సీబీకి చిక్కారు.
శివార్లపై నిఘా
ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసు అధికారులు తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. ఖాయిలాపడిన పరిశ్రమలు/ప్రయోగశాలలను ఫార్మా రంగంలో పరిచయమున్న పెద్దలు అద్దెకు తీసుకొని, ఫార్మా రంగ నిపుణులకు భారీగా డబ్బు ఆశచూపి బయటకు రప్పిస్తున్నారు. ఎఫిడ్రిన్, మెఫిడ్రిన్, యాంఫిటోమైన్ వంటి నిషేధిత పదార్థాలను తయారు చేయిస్తున్నారు. ఆయా ప్రాంతాలపైన నిఘా పెట్టారు.
ఎవరీ ఎస్‌కేరెడ్డి ?
ఇటీవల కూకట్‌పల్లి వద్ద అపార్ట్‌మెంట్‌లో మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఆ ఆధారాలతో పెద్ద మొత్తంలో మెఫిడ్రిన్‌ను(Mephedrone drug) స్వాధీనం చేసుకున్నారు. కీలక సూత్రధారి సడిపిరాల సురేశ్ రెడ్డి అలియాస్ ఎస్‌కే రెడ్డి, సుకేశ్ రెడ్డి తదితర మారు పేర్లతో దందా సాగిస్తున్నట్టు గుర్తించారు. మాదకద్రవ్యాల తయారీలో అపార పరిజ్ఞానం ఉన్న ఇతడికి అంతర్జాతీయ మత్తు మాఫియాతో సంబంధాలు ఉండవచ్చని భావిస్తున్నారు.
- ఇదీ చదవండి : Drugs case: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు