పట్టణాలూ, నగరాలూ కాంక్రీటు అరణ్యాల్లా మారిపోయాయన్నది కాదనలేని సత్యం. కానీ ఆ సిమెంటు గోడలు క్రమంగా పచ్చదనంతో చిగురిస్తున్నాయి. పెరుగుతోన్న ఉష్ణోగ్రతల్ని తగ్గించేందుకో, ఆరోగ్యం కోసమో... కారణమేదయితేనేం, సేంద్రియ పద్ధతుల్లో మిద్దె తోటల్ని పెంచేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే డాబాలమీద అనగానే కుండీల్లోనో గ్రోబ్యాగుల్లోనో పెంచుకునే కూరగాయలూ ఆకుకూరలూ మాత్రమే గుర్తొస్తాయి. కానీ ధాన్యాన్నీ ఇళ్లమీద పెంచవచ్చు అని ఊహించలేం. కానీ అవసరం అన్నీ నేర్పిస్తుంది.
ఎందుకంటే- వరి పండించాలంటే రైతుల కృషి ఒక్కటే సరిపోదు. ప్రకృతీ అనుకూలించాలి. పంట చేతికొచ్చే సమయంలో ఎడతెరపి లేని వానలు కురిస్తే వరదల కారణంగా ధాన్యం మొత్తం నేలపాలైపోతుంది. వ్యవసాయ ప్రధానమైన దేశాల్లో ఇలా చాలాసార్లు జరుగుతుంటుంది. పంట నష్టం సంగతి అలా ఉంచితే, కొన్ని సందర్భాల్లో రవాణా ఖర్చులు భారంగా మారి, తిండిగింజలకీ కొరత ఏర్పడవచ్చు. వాతావరణ మార్పుల్ని ఎటూ అడ్డుకోలేం కాబట్టి, వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో భాగమే ఈ రూఫ్‌టాప్ వరి సాగు.
నష్టం లేకుండా...
బ్యాంకాక్‌లోని థమాసట్ విశ్వవిద్యాలయాన్ని మిద్దె పొలాలకి చూడచక్కని ఉదాహరణగా చెప్పు కోవచ్చు. భవనం మీద ఉన్న ఏడు వేల చదరపు అడుగుల స్థలాన్ని వరిసాగుకు అనుకూలంగా మలిచిన తీరు అద్భుతం. దాంతో ఈ భవనం ఆసియాలోనే అతిపెద్ద మిద్దె పొలంగా పేరొందింది. వర్షాలు కురిసినా పంట కొట్టుకుపోకుండా ఉండేలా నేలమీద మడులు కట్టినట్లే భవనంపైనా సిమెంటుతో గడులు గడులుగా నిర్మించారు. భారీ వర్షాలొచ్చినా నీరు నిల్వ ఉండకుండా డిజైన్ చేశారు కాబట్టి పంటకి నష్టం ఉండదు.
నిజానికి ఇంటిపైన వరిని సాగు చేయాలన్న ఆలోచన మరీ కొత్తదేం కాదు. చైనాలోని లియుజొ, జెజియాంగ్ ప్రాంతాల్లో కొందరు రైతులు అచ్చం నేలమీద పండించినట్లే డాబాలమీదా వరిని తమదైన పద్ధతుల్లో పండిస్తున్నారు. ఇందుకోసం ముందుగా మిద్దెని వాటర్‌ప్రూఫ్‌గా మార్చాక మట్టి పోస్తారు. ఆ తరవాత సంప్రదాయ పద్ధతుల్లోనే నాట్లు వేసి వరిని పండిస్తున్నారు. దీనివల్ల వాళ్లకు సరిపడా ధాన్యాన్ని సొంతంగా పండించుకోగలగడతోబాటు వేసవిలో చల్లగానూ ఉంటుందట. పైగా మిద్దెమీద పండించడం వల్ల క్రిమికీటకాల బెడదా ఉండదు, పంటలకి తెగుళ్లూ రావు. దాంతో పెస్టిసడ్లతో పని ఉండదు కాబట్టి ఆరోగ్యానికీ మంచిది అంటున్నారు అక్కడి రైతులు.
లియుజొలో అయితే ఓ బీరు ఫ్యాక్టరీ మిద్దె మొత్తాన్నీ పంటపొలాలకు అనుకూలంగా తీర్దిదిద్దారు. ఒక భవనం మీద నుంచి మరో దానిమీదకు వెళ్లేలా వంతెనల్ని నిర్మించుకుని మరీ గత కొన్నేళ్లుగా వరిని సాగుచేస్తున్నారక్కడ. మనదగ్గరా కొంతమంది ఔత్సాహికులు మిద్దెమీద తమదైన పద్ధతుల్లో వరిని పండిస్తున్నారు. బెంగళూరు వాసి విశ్వనాథన్, హైదరాబాద్‌కు చెందిన గణేశ్‌బాబు ఇంటిపైన మట్టిని నింపి పండిస్తే, మంగళూరు నివాసి కృష్ణప్ప గ్రోబ్యాగుల్లోనూ తిరువనంతపురానికి చెందిన రవీంద్రన్ కుండీల్లోనూ వరిని పండించారు.
ఆసక్తికొద్దీనో లేదూ ఆరోగ్యం కోసమో... కారణం ఏదయినప్పటికీ మున్ముందు ఎవరి తిండిని వాళ్లే పండించుకోవాల్సిన అవసరం రావచ్చు, అప్పుడు మిద్దెమీద వరి సాగు సర్వసాధారణంగా మారుతుంది. కాబట్టి భవిష్యత్తులో పచ్చని పైరగాలికోసం పల్లెలకో నగరశివార్లకో పరుగులు తీయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎంచక్కా ఇళ్లూ అపార్టుమెంట్లూ కార్పొరేట్ భవంతులమీద పెరిగే పచ్చని పంటపొలాల్లోనే విహరించవచ్చు!