రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను అత్యాధునిక వసతులతో బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి జగన్ సంకల్పమని.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అందుకే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాలతోపాటు దానికి అనుసంధానంగా ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వివరించారు. పేదలకు మెరుగైన వైద్య సహాయం అందుతుందనేది ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు. ప్రభుత్వ ఆలోచనలకు దాతల సహకారం తోడైతే పటిష్టమైన వైద్యం అందరికీ అందుతుందని.. సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల చొరవను అభినందించారు. వారం రోజుల్లో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
కలెక్టరు నివాస్ మాట్లాడుతూ... పరిశ్రమల సహకారంతో ఆక్సిజన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. రాంకో, కేసీపీ సిమెంట్ కంపెనీలు ఆక్సిజన్ సరఫరాకు సహకరిస్తున్నాయని తెలిపారు. 50 పడకలకు మించి ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో వంద సిలిండర్ల సామర్ధ్యం కలిగిన డిటైప్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయాలని చెప్పారు. రెండు కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి డాక్టర్ నలమాటి అమ్మన్న మాట్లాడుతూ.. రాష్ట్రంతోపాటు విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకు వచ్చారన్నారు. వారి సహకారంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఐసీయూ కిట్లు ఇతర పరికరాలతోపాటు కొవిడ్ నివారణ మందులను పంపిణీ చేశామని వెల్లడించారు.
ఇదీ చదవండీ... Vaccination Sunday:రేపు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు