లాక్‌డౌన్ రూపంలో ఎదురైన పెనుసవాల్‌ను 180 బిలియన్ డాలర్లకు చేరిన దేశీయ ఐటీ రంగం దీటుగా ఎదుర్కొంటోంది. అత్యధిక ఉద్యోగులు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసేందుకు అనుమతించడంతో, ప్రాజెక్టుల్లో అంతరాయం ఏర్పడకుండా కంపెనీలు చూసుకుంటున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీల కార్యాలయ ఖర్చులు తగ్గిపోగా.. ఉత్పాదకత పెరిగింది.
వీటికి పరిష్కారం
నగరాల్లో ట్రాఫిక్, అధిక వాయు కాలుష్యంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇంటి నుంచే పని వల్ల ఈ సమస్యలు నివారించవచ్చు.
* ‘ఐటీ కంపెనీలు క్యూబికల్స్ మోడల్ లేదా అద్దె భవనాల్లో దశాబ్దాలుగా నడుస్తున్నాయి. లాక్‌డౌన్ వల్ల ఇంటి నుంచి పని విధానానికి వేగంగా మారాయి’ అని టీసీఎస్ ఎండీ, సీఈఓ రాజేశ్ గోపీనాథన్ అన్నారు. 2025 నాటికి 25 శాతం మంది ఉద్యోగులే కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని తమ సంస్థ అంచనాగా టీసీఎస్ సీఓఓ గణపతి సుబ్రమణియన్ ఇటీవల వెల్లడించారు. తమ 3.55 లక్షల మంది నిపుణుల్లో 90 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని తెలిపారు. వివిధ ఐటీ కంపెనీల కార్యాలయాల నుంచి 25 లక్షలకు పైగా డెస్క్‌టాప్‌లను, సంబంధిత ఉద్యోగుల ఇళ్లకు రవాణా చేసేందుకు నాస్‌కామ్ తోడ్పాటు అందించిందని డబ్ల్యూఎన్‌ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేశవ్ మురుగేశ్ తెలిపారు. ఉద్యోగులకు మేలుతో పాటు సంస్థలకు వ్యయం తగ్గుతున్నందున, ఇంటి నుంచే పనిని కొనసాగించేలా చూస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి తెలిపారు.
మహిళలకు మరింత ఉపయోగం
వివాహం, పిల్లల కారణంగా ఐటీ ఉద్యోగాలు మానేస్తున్న మహిళలకు ఇంటి నుంచే పని విధానం కలిసి రానుంది. ఇంటి నుంచే పని కొనసాగాలంటే నెట్‌వర్క్ సమస్యలు రాకుండా, సెజ్ నిబంధనల వంటి అంశాల్లో ప్రభుత్వంతో సంప్రదింపులకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
ఇవీ చదవండి...వ్యాక్సిన్ లేకుండా కరోనాను ఎదుర్కోవడం ఎలా?