New Mandals: తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని కొత్త మండలాలు రానున్నాయి. మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజా ఆకాంక్షలు, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ జిల్లాల్లో నూతన మండలాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నారాయణపేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లె మండలాలు ఏర్పాటు కానున్నాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో దుడ్యాల్ మండలం కానుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో కౌకుంట్ల మండలం ఏర్పాటు కానుంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆలూర్, డొంకేశ్వర్ కొత్త మండలాలు కానున్నాయి. జిల్లాలోని బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం ఏర్పాటు కానుంది. మహబూబాబాద్ జిల్లాలో సీరోల్, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్ మండలాలు కొలువు తీరనున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిజాంపేట్ మండలంగా మారనుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో డోంగ్లి మండలం ఏర్పాటు కానుంది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎండపల్లి, కోరుట్ల డివిజన్ పరిధిలో భీమారం మండలాలు ఏర్పాటు కానున్నాయి.
అభ్యంతరాలకు 15 రోజులు..: కొత్త మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.
కొత్తగా ఏర్పడనున్న మండలాల వివరాలు ఇలా..
- నల్గొండ జిల్లాలో గట్టుప్పల్ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు
- నారాయణపేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లె మండలాలు
- వికారాబాద్ జిల్లాలోని దుడ్యాల్ మండలం ఏర్పాటు
- మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఏర్పాటు
- నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, సాలూర, డొంకేశ్వర్ మండలాలు
- మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా సీరోల్ మండలం ఏర్పాటు
- సంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిజాంపేట్ మండలం ఏర్పాటు
- కామారెడ్డి జిల్లాలో కొత్తగా డోంగ్లి మండలం ఏర్పాటు
- జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం మండలాలు ఏర్పాటు
ఇవీ చూడండి