Save Sparrow: కొన్నేళ్ల కిందట వరకు ఇళ్ల పరిసరాలల్లో పిచ్చుకలు సందడి చేసేవి. పూరిళ్ల సూరుల్లో, చెట్టు కొమ్మలకు గూళ్లు పెట్టుకుని జీవిస్తుండేవి. కిచ్కిచ్మంటూ తిరిగే ఈ చిన్ని ప్రాణికి ప్రస్తుతం పెద్ద కష్టం వచ్చింది. సెల్ టవర్ల రేడియేషన్, గాలి కాలుష్యంతో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయి వాటి మనుగడకే ప్రమాదం ఏర్పడింది. పిచ్చుకలు పంటలపై వాలుతున్న పురుగులను తింటూ రైతులకు మేలు చేకూరుస్తాయి. పంట పొలాల్లో కృత్రిమ ఎరువులు, రసాయనీక పిచికారీ మందులు వినియోగించడంతో వాటికి ముప్పు ఏర్పడుతోంది. ఈ తరుణంలో స్ఫూర్తి శ్రీనివాస్ తన వంతుగా చిన్న ప్రయత్నాన్ని ప్రారంభించారు.
మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు పిచ్చుకల సంరక్షణ(సేవ్ స్పారో) అనే అంశంపై ఆన్లైన్లో పోటీలు నిర్వహించారు. 3500 మంది చిన్నారులు, యువత ఇందులో పాల్గొన్నారు. పిచ్చుకల మనుగడకు ముప్పు ఎలా వాటిల్లుతోందో.. ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే వివిధ అంశాలపై వివిధ చిత్రాలను వేసి సమాజానికి మంచి సందేశాన్ని అందించారు. కొన్ని రోజులుగా పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు, పిచ్చుక చిత్రాలు, గూళ్ల నమూనాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి విద్యార్థులలో చైతన్యం తీసుకొచ్చారు. పిచ్చుకల కోసం కృత్రిమ నివాసాలు ఏర్పాటు చేయడం, ఇంటి పరిసరాలలో చిన్న చిన్న గిన్నెలలో నీళ్లు పోసి ఉంచడం, బియ్యం, జొన్నలు, సజ్జలు వివిధ రకాల ధాన్యపు గింజలను ఇంటి ఆవరణలో ఉంచడం, గాలి పటాలు ఎగురవేసేటప్పుడు వాటికి దారాలు తగలకుండా జాగ్రత్త పడటంతో పాటు వివిధ చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
విజేతలకు సిద్దార్ధ ఆడిటోరియంలో ఆదివారం బహుమతులు ప్రధానం చేయనున్నారు. నేటి తరం చిన్నారులకు, యువతకు ప్రకృతి పట్ల, ప్రకృతిలో మమేకమైన జీవరాశుల పట్ల ఉన్న బాధ్యతను తెలియపరచడంతో పాటు వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకే ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ డైరెక్టర్ స్ఫూర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Loss to Banana Farmers: కర్నూలులో గాలివానకు నేలవాలిన అరటి పంట