తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 'మీరు ఎంత నడిపితే మేమూ అంతే' అన్న విధానం ప్రకారం రెండు రాష్ట్రాలు సమాన సంఖ్యలో సర్వీసులు, కిలోమీటర్లు నడిపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. వీటికి సంబంధించి మూడు దశల్లో ఒప్పందం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రతిపాదించింది. ప్రస్తుతం డిమాండు బాగున్న మార్గాల్లో బస్సులు నడపాలన్నది వ్యూహంగా ఉంది. ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన నూతన రవాణా చట్టంలో అంతర్ రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు ఒప్పందం చేసుకోవాలంటే ఆయా మార్గాలను ముందుగా ప్రకటించాలి. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి కొంత సమయం పడుతుంది. అందుకు వీలుగా రెండు దశల్లో చర్చలకు అధికారులను పంపాల్సిందిగా ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణను కోరింది.
త్వరలో అధికారుల స్థాయిలో జరిగే చర్చల్లో మార్గాల ముసాయిదా జాబితాను సిద్ధం చేసే అవకాశం ఉంది. ఈ వివరాలను తెలుసుకునేందుకు ‘ఈనాడు-ఈటీవీభారత్’ ప్రయత్నించగా తెలంగాణ ఆర్టీసీ ఇన్‌ఛార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్‌శర్మ ఆందుబాటులోకి రాలేదు. తెలంగాణ ఆర్టీసీతో సమన్యాయం ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించామని... ప్రసుత్తం ఏపీ ఎక్కువ కిలోమీటర్లు నడుపుతున్న మాట వాస్తవమేనని ఏపీ రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అన్నారు.
ఇదీ చదవండి: ఇంధన భారం రూ.217 కోట్లు