NTR VERSITY : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై దృష్టి పెట్టిన వైకాపా ప్రభుత్వం ఎన్నడూ అభివృద్ధి గురించి ఆలోచించిన పాపాన పోలేదు. దీనివల్ల వైద్య విద్యలో కీలకమైన పరిశోధనలు జరగడం లేదు. ప్రవేశాలు, పరీక్షలు, ఫలితాల వెల్లడికి మాత్రమే కార్యకలాపాలు పరిమితమయ్యాయి. ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కొన్నేళ్లుగా విద్యార్థుల ఫీజుల ఆధారంగా వచ్చిన మొత్తంలో అధిక భాగాన్ని ప్రభుత్వమే తీసేసుకుంది.
గతేడాది చివర్లో అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ రూ.400 కోట్లను మళ్లించుకుంది. ప్రస్తుతం వడ్డీ ఇస్తున్నా, అది ఎంతకాలమో తెలియదని ఉద్యోగులు చెబుతున్నారు. నిధులు ఖజానాలో ఉన్నప్పటికీ, అభివృద్ధి పనులు చేపట్టాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి వస్తోంది. ఉద్యోగులకు నెలకు వేతనాల కింద రూ.12కోట్ల వరకు అవసరం కాగా, ప్రభుత్వం రూ.5.5 కోట్లే కేటాయిస్తోంది. మిగిలిన మొత్తాన్ని ఫీజుల ద్వారా సర్దుబాటు చేస్తోంది. విశ్వవిద్యాలయ అవసరాలకు 221 మంది ఉద్యోగులు అవసరం కాగా 80 మందే శాశ్వత విధానంలో పని చేస్తున్నారు.
మరికొందరు పొరుగుసేవల కింద నియమితులయ్యారు. పదోన్నతులు లేక సీనియర్ ఉద్యోగులు నష్టపోతున్నారు. విశ్వవిద్యాలయానికి అనుబంధంగా సుమారు 350 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. మెడికల్, డెంటల్, ఆయుష్, నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు నిర్వహించే విద్యా సంస్థలకు వర్సిటీ మార్గదర్శకంగా ఉండాలి. కొత్తగా వైద్య కళాశాలలు ప్రారంభిస్తున్నామని చెప్పే ప్రభుత్వం వాటికి దిశానిర్దేశం చేయాల్సిన విశ్వవిద్యాలయ అభివృద్ధిని తొక్కేస్తోంది.
అభద్రతా భావం
విశ్వవిద్యాలయాన్ని నడిపించే వీసీ, రిజిస్ట్రార్‌లోనూ అభద్రతా భావం నెలకొంది. ఎప్పుడు.. ఈ పదవుల్లో నుంచి తమను తప్పిస్తారోనన్న ఆందోళనలో వారు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ప్రభుత్వం మారిన కొద్దికాలానికి అప్పటి వీసీ సీవీ రావును, రిజిస్ట్రార్ పదవిలో ఉన్న శంకర్‌ను ఇటీవల వైకాపా ప్రభుత్వం తప్పించింది. రిజిస్ట్రార్ పోస్టు భర్తీకి ఐదారు దరఖాస్తులు రాగా ‘మెచ్చిన’వారు లేరని నియామకాన్ని ప్రభుత్వం పక్కనబెట్టింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
పొరుగు విధానంపైనే ఆధారం!
విశ్వవిద్యాలయానికి సొంత వైద్య కళాశాల, ఇతర విద్యాసంస్థలు లేనందున పొరుగు రాష్ట్రాల్లోని వైద్య బోధకుల ద్వారా పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పన జరుగుతోంది. ప్రభుత్వ బోధనాసుపత్రులు ఉన్నా అవి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయ పర్యవేక్షణలో పని చేస్తున్నాయి. అక్కడ పనిచేసే బోధకులపై వర్సిటీ పర్యవేక్షణ ఉండటం లేదు. అభివృద్దికి ఇదొక ప్రతిబంధకంగా మారుతోంది. వివిధ సంస్థల ఒప్పందాలతో నామమాత్రంగా పరిశోధనలు చేస్తున్నారు. అత్యాధునిక ల్యాబ్స్ లేవు. కిందటేడాది ఎన్నారై కోటా సీట్ల భర్తీలో బ్లాకింగ్ వ్యవహారం విశ్వవిద్యాలయాన్ని కుదిపేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనందువల్ల కార్యకలాపాలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి.
అమరావతిని భ్రష్ఠు పట్టించడంతో..!
గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో విశ్వవిద్యాలయ కార్యకలాపాల విస్తృతి కోసం సుమారు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. వైకాపా ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడంతో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆశలు అడియాసలయ్యాయి. ప్రస్తుతం 2.5 ఎకరాల విస్తీర్ణంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. స్థలం ఎక్కువగా ఉంటే వైద్య విద్యకు సంబంధించిన అన్ని రకాల మండళ్లు, కార్యాలయాలు ఒకేచోట ఉండేందుకు వీలవుతుంది. ప్రభుత్వ చర్యలతో అది సాధ్యం కాలేదు.
విద్యార్థులకు కొత్త అవస్థలు
ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంతో కోర్సులు పూర్తిచేసే వారికి కొత్త సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. అనుబంధ వైద్య విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఆరోగ్య విశ్వవిద్యాలయం సెమిస్టర్, వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంది. ఎంబీబీఎస్, పీజీ, హోమియో, యునాని, ఆయుర్వేద, తదితర కోర్సులకు సంబంధించి సుమారు 20వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు చివరి సంవత్సరం మార్కుల మెమో వైఎస్సార్ పేరుతో, అంతకుముందు ఉన్న మార్కుల మెమోలు ఎన్టీఆర్ పేరుతో ఉండడంవల్ల ఉన్నత విద్య, ఉద్యోగాల్లో చేరేప్పుడు విద్యార్థులు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
విదేశాల్లో చదవాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పేరు మారుస్తారు. దీనివల్ల ఎవరైనా చూస్తే ఎన్టీఆర్ పేరు కనిపించదు. ఈ సమస్యలపై అధికారులు స్పందిస్తూ.. ‘ప్రభుత్వం జారీచేసే గెజిట్‌లో పూర్తి వివరాలు ఉంటాయి. పేరు మార్పు ఎప్పటినుంచి అమల్లోకి వచ్చిందో వివరణ ఉంటుంది. దీనిని విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగాలను పొందే సమయంలో గెజిట్ ప్రతిని అదనంగా దరఖాస్తులతోపాటు జతచేస్తే మంచిది. ఒకవేళ ఆయా సంస్థల నుంచి విశ్వవిద్యాలయానికి సమాచారం వస్తే దానికి తగ్గట్లు పేరు మార్పు వ్యవహారంపై వివరణ పంపుతారు. కొన్నాళ్లు ఈ సాంకేతిక సమస్యలు తప్పవు. విశ్వవిద్యాలయం ఒకేసారి బల్క్‌లో మార్కుల మెమోలు, పట్టాలు ముద్రిస్తుంది. తాజా నిర్ణయంవల్ల కొన్ని ఉపయోగించలేని పరిస్థితులు తలెత్తుతాయి.
ఇవీ చదవండి: