చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి విస్తరణలో భాగమైన విజయవాడ బైపాస్ రహదారి పనులు ఈ డిసెంబర్ లేదా వచ్చే జనవరిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బైపాస్ విస్తరణను చిన్న అవుట్‌పల్లి నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు రెండు ప్యాకేజీలుగా విభజించారు. హమ్ హైబ్రిటి యూన్యుటీ మోడ్ విధానంలో టెండర్లు ఖరారు చేశారు. ఈ పద్ధతిలో గుత్తేదారు సంస్థకు 40శాతం నిధులు మాత్రమే మంజూరుచేస్తారు. 60శాతం నిధులు ఆ సంస్థే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉండవు. సంస్థకు 60శాతం నిధులను 15 ఏళ్లలో చెల్లించే విధంగా ఎన్హెచ్ఏఐ ఒప్పందం కుదుర్చుకుంటుంది. మధుకాన్, గామన్‌లు టెండర్ల ప్రక్రియ నుంచి తప్పుకోవటంతో ఈపీసీ కింద పిలవాల్సిన ఈ ప్యాకేజీ టెండర్లను హమ్ పద్ధతిలోకి ఎన్హెచ్ఏఐ మార్చింది. మార్చిలోనే టెండర్ల ప్రక్రియ ముగిసినప్పటికీ కొవిడ్ కారణంగా పనుల ప్రారంభం ఆలస్యమైంది.
ఖరీఫ్ నాటికి విస్తరణ పనులు ప్రారంభం కాకపోవటంతో రైతులు పంటలు వేశారు. మట్టి నమూనాలు పరిశీలించిన అధికారులు మే నెలలో లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఇచ్చారు. రెండు నెలల కిందట ఒప్పందాలు కుదిరాయి. బ్యాంకు రుణాలు, ఆర్థిక వనరులు సమకూర్చుకున్న తర్వాత మాత్రమే పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసే అవకాశముంది. మూడో ప్యాకేజీలో చిన్నఅవుట్‌పల్లి, మర్లపాలెం, గొల్లన పల్లి, బీబీగూడెం, సూరంపల్లి, నున్న మీదుగా గొల్లపూడి వరకూ ఆరు వరసలతో విస్తరణ పనులు చేపట్టనున్నారు. దీనికి ఒక టోల్‌గేట్ వస్తుంది. నాలుగో ప్యాకేజీలో కృష్ణానదిపై వంతెన నిర్మాణం సహా గుంటూరు జిల్లా చినకాకాని వరకు రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. నున్న సమీపంలో తమ బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకున్నామని మూడో ప్యాకేజీ దక్కించుకున్న మెగా సంస్థ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. యంత్ర సామగ్రి సమకూర్చుతున్నామన్నారు.
ఇదీ చదవండి:
పాఠశాలకూ పాకిన మహమ్మారి.. వైరస్ బారిన పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు