Bicycle Bike : ప్రయోగాలు చేయాలంటే ప్రయోగశాలే అవసరం లేదు... సరికొత్తగా సాధించాలన్న తపన ఉంటే చాలు అద్భుతాలు సృష్టించవచ్చునని నిరూపిస్తున్నాడు హైదరాబాద్‌కు చెందిన మణితేజ. బీఏ మూడో సంవత్సరం చదువుతున్న ఈ కుర్రాడు..సైకిల్ విడిభాగాలతో ఎలాగైనా మోటార్ సైకిల్ చేయాలనుకున్నాడు. అనుకున్నది సాధించాడు.
కాలేజీ చేయూత : ఈ తరహా ఆలోచన మణితేజకు ఎప్పటి నుంచో ఉన్నప్పటి.. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ప్రయత్నం కొన్నాళ్లు ఆలస్యమైంది. ఇక చేసేదేం లేక తాను చదువుతున్న కళాశాల యాజమాన్యానికి సైకిల్ టూ మోటార్ సైకిల్ కాన్సెఫ్ట్ వివరించాడు. అది నచ్చిన వారు ప్రాజెక్టు కోసం కొంత విరాళం అందించారు. దానికి తోడు మిత్రులు కూడా ఆర్థిక సాయం చేశారు.
"నా స్నేహితుడి వాళ్ల నాన్న దగ్గర పాత బైక్ ఉండేది. ఆ బైక్ ఇంజిన్‌ను తీసుకున్నాను. నా దగ్గర ఉన్న సైకిల్‌కు ఆ బైక్ ఇంజిన్‌ను అమర్చాను. సైకిల్‌కు బైక్ ఇంజిన్ అమర్చి దాన్ని సైకిల్ బైక్‌గా తయారు చేసే క్రమంలో నేను చాలా సార్లు ఫెయిల్ అయ్యాను. దానివల్ల ఆర్థికంగా కూడా కష్టాలు ఎదుర్కొన్నాను. నేను చిన్న జాబ్ చేసే వాడిని కానీ వచ్చే జీతం నాకు సరిపోకపోయేది. ఈ బైక్ తయారీకి మా కాలేజ్ ఫ్రెండ్స్, ప్రిన్సిపాల్ చాలా సాయం చేశారు. ఇలా అందరి సాయంతో మూడు నెలలు కష్టపడి ఈ బైక్‌ను తయారు చేశాను."
- మణితేజ
చిన్న బాడీ.. పెద్ద ఇంజిన్ : మెకానిక్ షాపులో పనిచేసిన అనుభవం మణితేజకు ఉంది. ఆ ధైర్యంతోనే.. స్నేహితుడి వద్ద ఉన్న తుప్పు పట్టిన స్కూటర్‌ను తీసుకున్నాడు. అందులో నుంచి ఇంజిన్ మాత్రమే తీసుకున్నాడు. దాని ద్వారా... చిన్న బాడీ పెద్ద ఇంజన్ ఉండే మోటార్ సైకిల్ తయారు చేయడానికి సిద్ధమయ్యాడు. సైకిల్ టూ మోటార్ సైకిల్ చేయాలనుకున్న మణితేజకు మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. డిజైనింగ్‌లో తప్పిదాల వల్ల కొంత డబ్బు వృథా అయింది. దీంతో.. డబ్బు కోసం కొన్నాళ్లు మెకానిక్ షాప్‌లో పని చేశాడు. అలా.. సుమారు 40 వేల రూపాయలు ఖర్చు చేసి... ఈ ఆవిష్కరణ చేశాడు.
3 నెలల సమయం : ఈ ఆవిష్కరణ కోసం మణితేజకు 3 నెలల సమయం పట్టింది. చేతితోనే గేర్లు వేయడం ఈ మోటార్ సైకిల్ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ బైక్.. లీటర్‌కు 25 కిలోమీటర్ల మేర మైలేజ్ ఇస్తుంది. సుమారు 3 వేల కిలోమీటర్లు నడిచిన అనంతరం మైలేజ్ పెరుగుతుంది. ఆ తరువాత లీటరుకు 46 నుంచి 50 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని మణితేజ చెబుతున్నాడు.
cycle Bike : మణితేజ మూడు నెలలుగా ఇంట్లోనే ఓ చిన్న షెడ్ ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ప్రభుత్వం, దాతలు ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే... సొంతంగా ఓ షెడ్ ను ఏర్పాటు చేసుకుని తమ కూమారుడు మరిన్ని ఆవిష్కరణలు చేస్తాడని మణితేజ తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
"మణితేజకు తన కాలేజీ వాళ్లు చాలా సాయం చేశారు. తన ప్రాజెక్టుకు సంబంధించి తాను చాలా కష్టపడ్డాడు. తన కష్టం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం సాయం చేస్తే తాను మరిన్ని ఆవిష్కరణలు చేస్తాడని అన్నారు."
- మణితేజ తల్లిదండ్రులు
ప్రస్తుతం మార్కెట్‌లో అధికంగా పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలే ఉన్నాయి. అవకాశం వస్తే... రెట్రో ఫిట్టింగ్‌తో కాలుష్య రహిత వాహనాలు తయారు చేస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.. మణితేజ.
- ఇవీ చదవండి : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్!