శ్రీశ్రీ విశ్వరూప సాక్షాత్కారానికి నిలువుటద్దం మహాప్రస్థానం అని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి కొనియాడారు. ఈ పుస్తకాన్ని ఎప్పుడు చదివినా అందులో కొత్తదనం ఉట్టిపడుతూనే ఉంటుందన్నారు. మహాప్రస్థానం పుస్తకాన్ని ప్రచురించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ సైజులో ముద్రించారు. విజయవాడలోని సిద్దార్థ ఆడిటోరియంలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తనికెళ్ల భరణి పాల్గొన్నారు. చలం, శ్రీశ్రీ రచనలు ఎప్పుడు చదివినా ఉత్తేజ పరుస్తాయని తనికెళ్ల భరణి అన్నారు. తెలుగువాళ్లు గర్వించే కవి శ్రీశ్రీ అని కొనియాడారు. తన పుస్తకాన్ని నిలువుటద్దం పరిమాణంలో చూసుకోవాలన్నది శ్రీశ్రీ కల అని, దాన్ని విశ్వేశ్వరరావు నెరవేర్చడం అభినందనీయమన్నారు.
‘తెలుగు కవితా కన్యను జనాల్లోకి రాకుండా జనానాల్లో నిర్బంధిస్తే.. మహార్వాటినంత మహాప్రస్థానం రాస్తూ.. సూర్యుడి మీద ఓ కాలు.. తూర్పు మీద ఓ కాలు మోపాడు శ్రీశ్రీ.. తెల్లజెండా కట్టిన నెత్తురు కలం ఊపాడు శ్రీశ్రీ. కలాన్ని కాలానికేసి సంధించాడు.. శ్రీ కి శ్రీ కి మధ్య ఒక సారస్వత మహాయుగాన్ని బంధించాడు.. అతను జ్వరమొచ్చిన దేవుడు.. కాల్తోన్న కాముడు.. ఆప్యాయంగా మందిస్తారో.. అసహ్యంగా నిందిస్తారో మీ ఇష్టం.. అతను జ్వరమొచ్చిన దేవుడు.. కాస్త జాగ్రత్త.. శ్రీశ్రీ అంటే రెండు మెరుస్తున్న కొడవళ్లు.. శ్రీశ్రీ అంటే రెండు చెమరుస్తున్న కళ్లు’ అని మహాకవి శ్రీశ్రీ మరణించినప్పుడు ఆయన మీద వాత్సల్యంతో రాసుకున్న కవితను కవి, నటుడు తనికెళ్ల భరణి సాహితీ ప్రియులకు చదివి వినిపించారు.
విప్లవ గీతాలను తెలుగు ప్రపంచానికి రుచి చూపించిన మహాప్రస్థాన కవి శ్రీశ్రీ అని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త కె.శివారెడ్డి కొనియాడారు. ఆధునిక వచన కవిత్వానికి మూలం మహాప్రస్థానమని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. ఒక జాతికి మేల్కొలుపు సాహిత్యమేనన్నారు. పెద్ద సైజులో ఈ పుస్తకాన్ని అద్భుతమైన పెయింటింగ్స్‌తో ప్రతి పేజీనీ ఒక కళాఖండంగా తీర్చిదిద్దారని అభినందించారు.
మహాప్రస్థానం పుస్తకాన్ని నిలువుటద్దం సైజులో కాకపోయినా అందులో సగం సైజులో ప్రచురించడం గౌరవంగా భావిస్తున్నామని శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు అన్నారు. ఈ కావ్యంలో జీవం ఉట్టిపడేలా ఛాయాచిత్రాలను అద్భుతంగా మలిచిన అరసవెల్లి గిరిధర్‌ను అభినందించారు. కథాసాహితి సంపాదకులు వాసిరెడ్డి నవీన్, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గా, తానా పూర్వాధ్యక్షులు జంపాల చౌదరి, మాడభూషి శ్రీధర్ తదితరులు ఆన్‌లైన్ ద్వారా తమ సందేశాన్ని వినిపించారు. కార్యక్రమానికి బండ్ల మాధవరావు సభాధ్యక్షులుగా వ్యవహరించారు.
ఇదీ చదవండి..