ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన విధానాన్ని ప్రభుత్వం... ప్రారంభించబోతోంది. చౌక బియ్యం సహా నిత్యావసర సరకులను ఇంటింటికి అందించబోతోంది. మొదట శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రభుత్వం.. ఫిబ్రవరి 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం మొబైల్ వాహనాలను సిద్ధం చేసింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇంటింటికి రేషన్ సరఫరా కోసం 2,500 వాహనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రారంభిస్తారు.
బియ్యం, నిత్యావసరాలను రేషన్ కార్డుదారుల ఇంటివద్దే అందించేందుకు 9,260 వాహనాలను రూ.539 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ వాహనాలను నిరుద్యోగ యువకులకు.. 60శాతం రాయితీపై ఇచ్చారు. ఈ వాహనాలకు... ప్రతీనెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్లు వినియోగించుకుంటారని ప్రభుత్వం తెలిపింది.
ఈ వాహనాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని కార్డుదారుని ఇంటి వద్దకే వెళ్లి అందజేయనున్నారు. వాలంటీర్ల ద్వారా.. కచ్చితమైన తూకంతో తిరిగి ఉపయోగించగలిగే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు.
వాహనాలకు జీపీఎస్ అమర్చడం వల్ల మొబైల్ యాప్ ద్వారా కార్డుదారులు పంపిణీ వివరాలను రియల్‌టైంలో తెలుసుకోవచ్చు. ఈ వాహనం ద్వారా ఒక రోజులో సగటున 90 మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. నెలకు 18రోజులు ఈ వాహనం తిరగనుంది. ఫిబ్రవరి 1నుంచి జిల్లాల్లో ఇంటింటికీ రేషన్ సరఫరా కోసం ఆయా ప్రాంతాలకు వాహనాలు చేరుకున్నాయి. అనంతపురం జిల్లాకు 754, కర్నూలు జిల్లాకు 760, నెల్లూరు జిల్లాలో 524 వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నారు.
ఇదీ చదవండీ.. గ్రామ సచివాలయాలే రిజిస్ట్రార్ కేంద్రాలు: సీఎం జగన్