NIA: మానవ అక్రమ రవాణా వ్యవహారంలో జాతీయ, అంతర్జాతీయ పర్యవసానాలకు దారితీసే కేసులను తాము దర్యాప్తు చేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎలాంటి కేసుల్లో తాము దర్యాప్తు చేయాలనే విషయం ఎన్ఐయే చట్టంలో పేర్కొన్నారని తెలిపింది. గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని గండాలయపేటకు చెందిన మూడు నెలల చిన్నారి .. ఏడు సార్లు విక్రయానికి గురైన ఘటనపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపింది. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యవసానాలు ఎదురయ్యేంత కేసు కాదని వెల్లడించింది. ఈ మేరకు ఎన్ఐఏ ఎస్పీ విక్రమన్ కౌంటర్ వేశారు.
చిన్నారులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనంపై పత్రికల్లో వచ్చిన రెండు కథనాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... సుమోటో ప్రజాహిత వ్యాజ్యాలుగా మలిచి విచారణ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఐ, ఎన్ఐఏకు నోటీసులు ఇచ్చి కౌంటర్ వేయాలని ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యాలు హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఎన్ఐఏ తరపున కౌంటర్ వేశామని సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో విచారణ మే 4కు వాయిదా పడింది.
ఇదీ చదవండి: Nellore court Theft Case: కోర్టులో చోరీ కేసు.. దర్యాప్తుపై సందేహాలెన్నో!