తెదేపా సీనియర్ నేత, రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ చలమశెట్టి రామానుజయ్య మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు. కాపు కార్పోరేషన్ తొలి ఛైర్మన్‌గా ఆయన విశేష సేవలందించారని చంద్రబాబు కొనియాడారు. కాపుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. కాపుల రిజర్వేషన్లు, విద్యార్ధుల విదేశీ విద్య, రుణమేళాలు, జాబ్ మేళాలు, మహిళల స్వయం ఉపాధి కోసం అనేక పథకాలు రూపొందించడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు. రామానుజయ్య మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- ఎంతో మంది కాపులకు అండగా నిలిచారు: లోకేశ్
రామానుజయ్య కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది కాపులకు అండగా నిలిచిన వ్యక్తి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కొనియాడారు. పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారన్న లోకేశ్... చివరి శ్వాస వరకూ ప్రజాసేవే ఊపిరిగా జీవించారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.... కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- ఆయన సేవలు మరువలేనివి: తెదేపా నేతలు
రామానుజయ్య అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని పలువురు తెదేపానేతలు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మచ్చలేని నాయకుడు, విలువలకు మారుపేరని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. కాపుల అభ్యున్నతికి రామానుజయ్య అందించిన సేవలు ఎనలేనివని మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు కీర్తించారు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు