రాష్ట్రంలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ ? అని ఆయన ప్రశ్నించారు. మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది అని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతిభద్రతలను గాలికొదిలేశారని ఆరోపించారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసిన ఘటన బాధాకరమన్నారు. విజయవాడ యువతి ఘటన, తిరువూరులో ఇంటర్ విద్యార్థినిపై వాలంటీర్ భర్త వేధింపులు లాంటి ఘటనలు మరువక ముందే దుగ్గిరాల ఘటన జరగటం దురృష్టకరమన్నారు. మహిళల రక్షణ విషయంలో పాలకులకు చిత్తశుద్ధి లోపించటం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. చట్టాలు చేశాం, యాప్ తెచ్చాం అని ప్రకటనలు మాత్రమే చేసే చేతగాని ప్రభుత్వం వల్ల ఆడబిడ్డలకు ధైర్యం కలగటం లేదని అన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు పడేలా కేసులు పెట్టాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Woman Raped and Murdered: గుంటూరు జిల్లాలో వివాహితపై హత్యాచారం.. పోలీసుల అదుపులో అనుమానితులు