రాష్ట్రంలో కొత్త ఇసుక విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎమ్ఎస్టీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భూగర్భ శాఖ అధికారులు, ఎమ్ఎస్టీసీ ఉన్నతాధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో ఇప్పటికే వర్గీకరించిన మూడు జోన్లలో ఇసుక తవ్వకాలను చేపట్టనున్నారు. ఎమ్ఎస్టీసీ ద్వారా ఇసుక తవ్వకాలు సరఫరా తదితర అంశాలను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా చేపట్టనున్నారు. 3 జోన్ ల ద్వారా ఇసుక తవ్వకం సరఫరాకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఎమ్ఎస్టీసీ వేర్వేరుగా బిడ్లను ఆహ్వానించనుంది.
శాస్త్రీయంగా తీసుకువచ్చిన కొత్త పాలసీ కారణంగా ప్రస్తుతం ఇసుక సరఫరా కావడంతోపాటు తక్కువ ధరకే ఇసుక అందుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఆన్‌లైన్ బదులు ఆఫ్ లైన్ ద్వారా ఇసుక ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా వినియోగదారులు తమకు నచ్చిన స్టాక్ యార్డుకు వెళ్లి పరిశీలించి అవసరమైన చెల్లింపులు చేసిన అనంతరం ఆఫ్‌లైన్‌లోనే తీసుకువెళ్లాలని ప్రభుత్వం ప్రకటించింది. ఎద్దుల బండ్ల ద్వారా తీసుకునే వారికి ఉచితంగానే ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. గ్రామాల స్వయం వినియోగం, గృహనిర్మాణ పథకాలు, ప్రభుత్వ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల ఇళ్ల నిర్మాణం కోసం ఇసుకను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
నూతన ఇసుక విధానం పారదర్శకతతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సూచనలు పాటిస్తూ విధివిధానాలు రూపొందించినట్టు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. మొత్తానికి కోటిన్నర టన్నులకు పైగా ఇసుకను మూడు ప్రాంతాల్లోనూ తవ్వి తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదీ చదవండి: రామతీర్థ ధర్మయాత్రపై పోలీసుల ఆంక్షలు...కన్నా గృహ నిర్బంధం