వైకాపా వేసిన అనర్హత పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవద్దంటూ..లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు (lok sabha speaker om birla) నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (mp raghu rama) లేఖ రాశారు. విప్ ధిక్కరణ, పార్టీ పట్ల విధేయత లేదంటూ ఈ నెల 23న వైకాపా ఇచ్చిన పిటిషన్‌ను పరిగణించవద్దన్నారు. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలపై తన సూచనలను తప్పుగా అర్థం చేసుకున్నారని నివేదించారు. తెలుగు భాష, తితిదే భూముల అమ్మకం, ఇసుక కొరత, నిర్మాణ సంబంధ కార్యకలాపాలు నిలిచిపోవడం వంటి అంశాల్లో ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేశానన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి అర్థం అయ్యేలా చెప్పడం తప్ప, ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు.
అసమ్మతి, అభిప్రాయభేదం మధ్య వ్యత్యాసం ఉందని..రాజ్యాంగం 10వ షెడ్యూల్ నిబంధనలను ఎప్పుడూ ఉల్లంఘించలేదని స్పష్టంచేశారు. 2016లో సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం తన విషయంలో సరిపోతుందని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులను లేఖలో వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే పేరుతో బెదిరింపులు రావడంతో 'వై' కేటగిరీ భద్రత కల్పించే విషయంలో లోకసభ స్పీకర్ జోక్యం చేసుకున్న విషయం లేఖలో ప్రస్తావించారు. నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారని...రాజీనామా చేయాలని కూడా ఒత్తిడి తీసుకువచ్చేందుకు అసత్య ఆరోపణలతో కేసులు పెట్టించారని రఘురామ అన్నారు. 124A సెక్షన్ కింద దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారని..హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలించి చిత్రహింసలకు గురిచేశారని ఇప్పటికే స్పీకర్‌కు నివేదించిన విషయం లేఖలో (letter) మరోమారు ప్రస్తావించారు.
స్వతంత్ర భారత చరిత్రలో ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన ఘటన తన విషయంలోనే జరిగిందన్నారు. అలాంటి తనపై విచిత్రమైన ఆరోపణలతో అనర్హత వేటు వేయించాలని ప్రయత్నం చేస్తున్నారని రఘురామ లేఖలో పేర్కొన్నారు.
ఇదీచదవండి