ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అభ్యంతరమేంటని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వానిది ద్వంద్వ వైఖరని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల నిర్వహణకు పనికిరారని స్వయంగా ఎన్నికల కమిషనే తేల్చిందన్నారు.
విద్యార్థుల ప్రాణాలను బలిపెడతారా ?
నవంబర్ 2 నుంచి పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాశానని రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు. ఆంగ్ల మాధ్యమంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ ఉందన్నారు. "కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తుంది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోకపోతే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది. పాఠశాలలో ఏ భాషలో విద్యాభ్యాసం ప్రారంభిస్తారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. సుప్రీంకోర్టులో స్టే రాకపోతే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను పాటించాలి. కరోనాను లెక్కచేయకపోయినా..విద్యార్థుల ప్రాణాలను బలిపెట్టడం సరికాదు" అని వ్యాఖ్యానించారు.
పథకాల పేరుతో పేదలకు డబ్బిచ్చి...అధిక మద్యం ధరలతో తిరిగి లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. విశాఖ ప్రజల ఇబ్బందులపై సోమవారం చాలా విషయాలు బయట పెడతానని వ్యాఖ్యనించారు.
ఇదీచదవండి
రాష్ట్రాన్ని రైతులు లేని రాజ్యంగా మార్చడమే లక్ష్యమా..? : లోకేశ్