అగ్రవర్ణ అహంకారంతో దళితుల్ని దూషించిన దేవినేని ఉమామహేశ్వరావు ఇంటికి చంద్రబాబు వెళ్లటం శోచనీయమని వైకాపా శాసన సభ్యుడు జోగి రమేశ్ అన్నారు. జి.కొండూరు వద్ద దళిత సంఘాలు నిరసన తెలియజేస్తే రౌడీయిజం అంటారా ? అంటూ రమేశ్ చంద్రబాబును ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసం నిరసన చేసే హక్కు తమకు కూడా ఉందని అన్నారు. దేవినేని ఉమా హయాంలోనే కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ లూటీ జరిగిందని ఆరోపించారు.
నిజనిర్ధరణ కమిటీ అంటూ తాడూ బొంగరం లేని వాళ్ళే అక్కడకు వెళ్లారని తెదేపా నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మైనింగ్ పేరిట దోచుకుంది ఎవరనేది త్వరలోనే తేలుస్తామన్నారు. వైకాపా కూడా నిజనిర్ధరణకు వస్తుందని..దేవినేని ఉమా దోపిడీని బయటపెడతామని రమేశ్ వ్యాఖ్యానించారు.
తెదేపా నేతల గృహనిర్భంధం
కొండపల్లిలో అక్రమ మైనింగ్ పై నిజనిర్ధరణ నిమిత్తం బయల్దేరిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బలవంతంగా అరెస్టు చేశారు. వంగలపూడి అనిత, నల్లమిల్లి రామకృష్ణారెడ్డితోపాటు..పార్టీ కార్యకర్తలను సైతం అదుపులోకి తీసుకుని..వాహనంలో అక్కడి నుంచి తరలించారు. పోలీసుల తీరును నేతలంతా తప్పుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పు జరగకుంటే.. తమను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై.. అక్రమ మైనింగ్ పై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.
ఇదీ చదవండి
Kondapalli: కొండపల్లికి వెళ్లకుండా.. తెదేపా నేతల అరెస్ట్.. బలవంతంగా తరలింపు