Ministers Committee Meet CM jagan On PRC: ప్రభుత్వ జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పీఆర్సీ అంశాలపై సీఎం జగన్‌తో సమావేశమైన మంత్రుల కమిటీ సభ్యులు.. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే కమిటీ వేశారని మంత్రి బొత్స అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించామని..,3 రోజులు గడచినా వారు చర్చలకు రాలేదన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని స్పష్టం చేశారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే కమిటీ వేశారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించాం. చర్చలకు వస్తారని ఉద్యోగుల కోసం 3 రోజులు వేచి చూశాం. చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగులు రాలేదు. జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయి. ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. -బొత్స సత్యనారాయణ, మంత్రి
సీంఎంతో జరిగిన సమావేశంలో మంత్రి బొత్సతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ అధికారుల పాల్గొన్నారు. హెచ్ఆర్ఏ శ్లాబు, జీతం రికవరీ, పింఛన్‌దారుల అంశంపైనా సీఎంతో మంత్రుల కమిటీ చర్చించినట్లు సమాచారం.
అది ఉద్యోగుల పొట్ట కొట్టే కమిటీ..
మరోవైపా పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ సచివాలయంలో ఉద్యోగులు నిరసనకు దిగారు. రివర్స్ పీఆర్సీ తమకొద్దని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 3న ఉద్యోగుల ‘చలో విజయవాడ’ ఆపడం ఎవరితరమూ కాదన్నారు. ఒత్తిడి తెచ్చి కొత్త వేతన స్కేళ్ల బిల్లులు చేయించే ప్రయత్నం చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రుల కమిటీపై విమర్శలు చేశారు. అది అపోహలు తొలగించే కమిటీ కాదని.. ఉద్యోగుల పొట్ట కొట్టే కమిటీ అని ఆవేదన వ్యక్తం చేశారు.
జీతాల చెల్లింపు ప్రక్రియ మందగమనమే..
ఉద్యోగుల అభీష్టానికి వ్యతిరేకంగా కొత్త వేతన సవరణ ప్రకారం జీతాలు ఇచ్చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా ఆ ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఆదివారం కూడా విధులకు హాజరై ఈ ప్రక్రియ చేపట్టాలని ఖజానా శాఖ అధికారులు తమ సిబ్బందిని ఆదేశించినా పరిస్థితి మందగమనంగానే ఉంది. ఖజానా సిబ్బంది అక్కడక్కడే హాజరై ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మరోవైపు సర్వర్ సహకరించకపోవడంతో పని ముందుకు సాగలేదని చెబుతున్నారు. జనవరి నెల జీతాల బిల్లుల ప్రక్రియ ముగించేందుకు ఇక ఒక్కరోజే మిగిలింది. ఎంత మేర బిల్లులు ప్రాసెస్ చేస్తారనేది ప్రశ్నార్థకమే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ జనవరి జీతాల బిల్లులు పెద్దగా సమర్పించలేదు. రాష్ట్రంలో మొత్తం 16,700 మంది డ్రాయింగ్ డిస్‌బర్సింగ్ అధికారులు ఉన్నారు. వీరిలో కొన్నిచోట్లే బిల్లులు సమర్పించే ప్రక్రియ జరిగింది. పోలీసుశాఖలో వీటి సంఖ్య ఎక్కువ. వీటిని ఖజానా అధికారులు పరిశీలించాలి. 500 మంది డీడీవోలకు సంబంధించి మాత్రమే కొంతమేర జరిగినట్లు అధికారవర్గాల సమాచారం.
డీడీవోలపై చర్యలకు సిఫార్సులు
అక్కడక్కడ కలెక్టర్లు జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ఒకరిద్దరు డీడీవోలు, ఖజానా అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జనవరి 29 సాయంత్రం 6 గంటల వరకు ఏడీడీవో వద్ద బిల్లుల ప్రగతి ఎలా ఉందో పేర్కొంటూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులిచ్చారు.
పింఛన్ల ప్రక్రియ పూర్తి
రాష్ట్రంలోని మొత్తం 4 లక్షలకు పైగా పింఛనర్లకు జనవరి నెల పింఛను కొత్త స్కేళ్ల ప్రకారం చెల్లించేందుకు రంగం సిద్ధమయింది. 2018 జులై ముందు పదవీవిరమణ చేసిన వారితో పాటు ఆ తర్వాత పదవీవిరమణ చేసిన వారికీ కొత్త పింఛన్ల బిల్లులు సిద్ధం చేశారు. ఆ మేరకు వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ చదవండి
New Judges: ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదుల పేర్లు సిఫారసు