‘ఆంధ్రాలో కొత్తగా తెరాస పార్టీ పెట్టాల్సిన పని ఏముంది? ఏపీ, తెలంగాణను కలిపేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి, రెండు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా! ఉమ్మడి రాష్ట్రంగా ఉందాం. అక్కడ ఇక్కడ ఒకే పార్టీ ఉంటుంది. కొత్తగా పార్టీ పెట్టే పనే ఉండదు’ అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. సచివాలయంలో గురువారం మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను వెల్లడించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆంధ్రాలోనూ పార్టీ పెట్టమంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యానించారు కదా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘రెండు రాష్ట్రాలను కలిపేస్తే అంతర్జాతీయ తెరాస, జాతీయ, ప్రాంతీయ తెరాస పార్టీ అనే అంశమే తలెత్తదు. ఏపీ, తెలంగాణ కలిపేసిన తర్వాత ఎవరికి ఓటేస్తే వారు సీఎం అవుతారు. ఎక్కువ పార్టీలుంటే ఇబ్బందేమీ ఉండదు. 2013లోనే ఆంధ్రప్రదేశ్‌ను దుర్మార్గంగా విభజించొద్దని, సమైక్య రాష్ట్రం తెలుగు వారికి అవసరమని జగన్ చెప్పారు. ఇవాళ కేసీఆర్ అక్కడా ఇక్కడా పోటీ చేయాలని అందరూ కోరుతున్నారంటున్నారు. తెరాస సంక్షేమ పథకాల గురించి భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర ప్రస్తావిస్తే నిజాలు తెలుస్తాయి. ఊళ్లో పల్లకీల మోత.. ఇంట్లో ఈగల మోత సామెతలా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెదేపా అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసి, మాట్లాడిన విషయాలను చెబితే బాగుంటుంది. ఫోన్ మాట్లాడటంపై మీడియాకు లీకులు ఎందుకు? చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వనందుకు అమిత్‌షానే బాధపడినట్లు ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించారు.
మాదకద్రవ్యాలపై మాట్లాడమనండి
హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు అమ్ముతున్నట్లు ఛానళ్లలో వస్తోంది.. దానిపై నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ను చెప్పమనండి అని ప్రశ్నించారు. ఏపీ నుంచే అన్ని రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతున్నట్లు రంగనాథ్ పేర్కొన్నారని అడిగిన మరో ప్రశ్నకు మంత్రి మాట్లాడుతూ.. ‘తెదేపా హయాంలో లారీల్లో గంజాయి తరలిస్తున్నట్లు 2017లో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై చర్చించామని చెప్పారు. జనసేన నేత పవన్ కల్యాణ్ బుధవారం ఒక ట్వీట్‌లో నల్గొండ ఎస్పీ రంగనాథ్ మాట్లాడింది, మరో ట్వీట్‌లో 2018లో ఆయనకు గంజాయి గురించి తెలిసినట్లు పేర్కొన్నారు. ఆయన మద్దతుతో వచ్చిన తెదేపానే అప్పట్లో అధికారంలో ఉంది కదా? మరి అప్పుడేం చేశారు? రంగనాథ్ విలేకర్ల సమావేశం పెడితే గానీ మత్తు వదల్లేదా? దుర్మార్గంగా అప్పట్లో గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు అరికట్టలేక చస్తున్నాం’ అని వెల్లడించారు.
మే నెలలోపు రోడ్ల మరమ్మతులు
‘మంత్రివర్గ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో రోడ్ల మరమ్మతులపై సమీక్షించాం. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు ఏటా రూ.400 కోట్ల వ్యయమవుతుంది. 8 వేల కిలోమీటర్లు మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటి మరమ్మతులకు రూ.2,205 కోట్లు మంజూరు చేశాం. ఇప్పటికే 40 శాతం పనులకు టెండర్లు పూర్తయ్యాయి. వర్షాలు తక్కువగా ఉన్న రాయలసీమలో పనులు చేపట్టారు. మిగతా 60 శాతం పనులకు నవంబరు 15లోపు టెండర్లు పిలిచి, నెలాఖరులోపు గుత్తేదారు సంస్థలను ఎంపిక చేయాలని, మే నెలలోపు పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు’ అని తెలిపారు.
ఓసీ వెలమలకు ప్రత్యేక కార్పొరేషన్
‘పద్మనాయక వెలమ వంటి ఓసీ వెలమల కోసం త్వరలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నాం. దీన్ని వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకురావాలని సీఎం సూచించారు. బ్రాహ్మణుల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గుడి డబ్బులు వాడేస్తున్నారంటూ విమర్శలు చేశారు. విమర్శలు, తప్పుడు ప్రచారం చేసే వారి నోళ్లు మూయించేలా ఈడబ్ల్యూఎస్ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశాం’ అని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి