సినిమాటోగ్రఫీకి సంబధించిన జీవో 35లో కొన్ని మార్పులు చేయాలని నటుడు చిరంజీవి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారని సమాచార శాఖ మంత్రి పేర్నినాని స్ఫష్టం చేశారు. టికెట్ల ధరల పెంపు అంశంపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా టికెట్ల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం చెబుతామని సినీ పెద్దలకు స్పష్టం చేశామన్నారు.
మరోవైపు ఇవాళ మధ్యాహ్నం సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లతోనూ ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. ఆన్లైన్ టికెట్లకు సంబధించిన సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణను శాసనసభ, మండలి ఆమోదించటంతో తదుపరి ప్రక్రియ కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి పేర్నినాని ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్నం సినీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
టికెట్ ధరలపై చిరంజీవి ట్వీట్...
రాష్ట్రంలో సినిమా టికెట్ల విక్రయం, ధరలు, షోలపై సర్కారు తెచ్చిన కొత్త చట్టంపై మెగాస్టార్ చిరంజీవి ఆచితూచి స్పందించారు. ఈ మేరకు నిన్న ట్విటర్లో ఓ పోస్టు పెట్టారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం అని చిరంజీవి అన్నారు. అదే సమయంలో టికెట్ ధరలపై తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు.
థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు దెరువు కోసం టికెట్ ధరలను సవరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా, కాలానుగుణంగా నిర్ణయిస్తే బాగుంటుందని కూడా పేర్కొన్నారు. దేశమంతా ఒకటే జీఎస్టీ అమలు అవుతున్నప్పుడు, టికెట్ ధరలలోనూ వెసులు బాటు ఉండాలని కోరారు. అంతేకాదు.. ఇలా టికెట్ ధరల్లో వెసులు బాటు ఉంటేనే తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందన్నారు.
ఇదీ చదవండి: chiranjeevi on cinema tickets: ఏపీలో సినిమా టికెట్ల ధరలు అలా ఉండాలి: చిరంజీవి