నాలుగు జిల్లాల్లో పశు, వ్యవసాయ వ్యర్థాల నుంచి సంప్రదాయేతర ఇంధన వనరులు, సేంద్రీయ ఎరువుల ఉత్పత్తిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్స్ (గోబర్) ధన్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు.
గ్రామాల్లో గోబర్ ధన్ పథకం కింద పశు వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను వినియోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణను రూపొందించినట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. కృష్ణా, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ పథకంను అమలు చేయనున్నట్లు వివరించారు. గోబర్ ధన్ పథకం అమలులో భాగంగా రాష్ట్ర స్థాయిలో అపెక్స్, అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయ, పశుసంవర్థక, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 10,645 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 1042 సెంటర్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. యాబై కంటే అధికంగా పశువులు ఉన్న 54 గోశాలలు, 55 భారీ డెయిరీ ఫాంలను గోబర్ గ్యాస్ ఉత్పత్తి కోసం గుర్తించడం జరిగిందన్నారు.
ఇదీ చదవండి:
Polavaram: జంతర్ మంతర్‌లో పోలవరం నిర్వాసితుల ఆందోళన.. జాతీయ నేతల మద్దతు