రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురావడమే కాక.. ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ వెళ్లిపోవాలని తమ ప్రభుత్వం కోరుకోవటం లేదని చెప్పారు. అవసరమయితే అక్కడకు సమీపంలోనే అదే సంస్థ కొనుగోలు చేసిన 4 వేల ఎకరాల్లో పరిశ్రమను స్థాపించుకోవచ్చని సలహా ఇచ్చారు. ప్రతీ పదేళ్లకు బ్యాటరీ తయారీ కంపెనీలు తమ యూనిట్‌లను రీ-లొకేట్ చేయాల్సి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. లాభాల కోసమే అమర్ రాజా కంపెనీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని భావిస్తోందని వ్యాఖ్యానించారు.
ఎంపీడీవోలకు పదోన్నతులు
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న 255 ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించామని మంత్రి వెల్లడించారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు రాలేదని అందుకే శాఖాపరమైన పదోన్నతులు కల్పించామని చెప్పారు. డివిజనల్ స్థాయిలో డెవలప్మెంట్ అధికారులకు కూడా పదోన్నతులు కల్పించామని వివరించారు. గతంలో బయటి శాఖల నుంచి ఉద్యోగులను తీసుకునే పరిస్థితి ఉండేదని... పదోన్నతుల కారణంగా ఇక డిప్యుటేషన్ల అవసరం రాబోదని చెప్పారు. ఎంపీడీవోల పదోన్నతుల అంశాన్ని పరిష్కరించిన ముఖ్యమంత్రి జగన్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:
అధికారుల మధ్య వాగ్వాదం... డీసీపై ఇసుక పోసిన అసిస్టెంట్ కమిషనర్