నివర్ తుపానులో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పవన్ కల్యాణ్ చేస్తున్న దీక్షపై మంత్రి వేణుగోపాల కృష్ణ విమర్శలు చేశారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకీ మద్దతిస్తూ వచ్చిన పవన్.. రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. పవన్లో నాయకత్వ లక్షణాలు లేవని మంత్రి పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడైనా ప్రజల ఆలోచన దిశగా నడిచారా అని ప్రశ్నించారు. సీఎం జగన్పై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. పంట నష్టం జరిగి రెండేళ్లు గడిచినా పరిహారం ఇవ్వని పరిస్థితి గతంలో ఉండేదన్న మంత్రి.. పంట నష్టం జరిగిన సీజన్లోనే సీఎం జగన్ పరిహారం అందిస్తున్నారన్నారు.
అందుకే మద్దతిచ్చాం..
గిట్టుబాటు ధర పెరుగుతుందనే కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చామని వేణుగోపాలకృష్ణ అన్నారు. గతంలో వ్యవసాయ బిల్లులకు తెదేపా నేతలు బేషరతుగా మద్దతు తెలిపి.. ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఇక్కడ మాత్రమే ఆందోళనలు చేస్తున్నారని.. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మోదీకి వ్యతిరేకంగా నల్ల చొక్కా వేసుకుని దిల్లీలో దీక్ష చేయాలని మంత్రి వేణుగోపాల కృష్ణ సవాల్ చేశారు.
ఇదీ చదవండి: 2021 ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు