Minister Suresh Review On Education: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మూడో విడత జగనన్న విద్యా కానుక అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. సచివాలయం నాలుగో బ్లాక్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు.
నాడు-నేడు పథకం క్రింద ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల మెరుగు, క్రీడా ప్రాంగణాల అభివృద్ది, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణానికై మొదటి, రెండో దశల్లో అమలు చేస్తున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యా సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఫౌండేషన్ స్కూళ్లలో ఉపాధ్యాయుల మ్యాపింగ్ వివరాలతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎయిడెడ్ టీచర్ల కేటాయింపు గురించి ఆరా తీశారు. విద్యా కానుక కిట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు అందరికీ అందజేయాలని మంత్రి సురేశ్ అధికారులకు సూచించారు.
సమీక్షలో పాఠశాల విద్య, సమగ్రశిక్ష, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఏపీ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ప్రభుత్వ పరీక్షల విభాగం, ఎస్సీఈఆర్టీ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
Chandrababu On YSRCP Govt: 'వైకాపా పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారు'