దేశ రక్షణ రంగ ఉత్పత్తిలోకి మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ సంస్థ ప్రవేశించింది. మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో గుర్తింపు సాధించిన ఎంఈఐఎల్ దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలు, వివిధ పరికరాలను తయారు చేసేందుకు అనుమతులు సంపాదించింది. రూ. 500 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఇందుకు సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు హోం, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలు అనుమతులిచ్చాయి.
మేకిన్ ఇండియాలో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020కి అనుగుణంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడి పరికరాలు, సాయుధ సంపత్తిని ఉత్పత్తి చేసేందుకు అనుమతి కోరుతూ ఎంఈఐఎల్ దరఖాస్తు చేసుకోగా.. కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలించి అనుమతులు మంజూరు చేసింది.
వివిధ దశల్లో రూ. 500 కోట్ల పెట్టుబడితో మేఘా గ్రూప్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. మేఘా సంస్థకే చెందిన ఐకామ్ సంస్థ లిమిటెడ్.. ఇప్పటికే జాతీయ రక్షణ రంగ సంస్థలకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తమ వంతు సహకారాన్ని అందిస్తోంది. తాజా అనుమతులతో హైదరాబాద్లో అత్యాధునిక శాస్త్ర-సాంకేతిక సామర్థ్యంతో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ఎంఈఐఎల్ అధ్యక్షులు శ్రీనివాస్ బొమ్మారెడ్డి.. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ కల, లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇదీచూడండి: భారత్, చైనా సరిహద్దు వివాదం.. చర్చలతోనే పరిష్కారం