విజయవాడ నగర శివార్లలో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుల ఫొటోలను పోలీసులు సేకరించారు. సంఘటనా స్థలం నుంచి కారును ముస్తాబాద్ వైపు తీసుకువెళ్లి టింబర్ డిపో ముందు వదిలేశారు. కారు వదిలేసి పారిపోతున్న సమయంలో అక్కడ సీసీ కెమెరాలో నిందితుల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటనా స్థలంలో దొరికిన బులెట్ల ఆధారంగా నిందితులు 7.65ఎమ్ఎమ్ పిస్టల్‌ను వాడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.
అసలేం జరిగింది...
పోలీసు కమిషనరేట్ కార్యాలయ ఉద్యోగి గజకంటి మహేష్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. నున్న బైపాస్ రోడ్డులోని సాయిరూపా బార్ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మహేష్ తన స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికొచ్చి పది రౌండ్లు కాల్పులు జరిపారు. మహేష్ శరీరంలోకి 3 తూటాలు దూసుకెళ్లగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్నేహితుడు హరికృష్ణకు సైతం బుల్లెట్ గాయాలయ్యాయి.
మహేష్‌ను స్నేహితులు హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించినప్పటికీ... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతున్నాడు. కాల్పులు జరిపిన అనంతరం ఘటనలో గాయపడ్డ హరికృష్ణ కారులోనే హంతకులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఇదీ చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన విజయవాడ కాల్పుల ఘటన