Gas Rates Hike:పేద, మధ్యతరగతి వినియోగదారులపై మరో భారం పడింది. శనివారం నుంచి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర మరో రూ.50 పెరిగింది. ఇప్పుడు సిలిండర్ కొనాలంటే..రూ.వెయ్యికిపైగా కావాల్సిందే. గరిష్ఠంగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రూ.1,069కి చేరింది. రాయితీ రూపంలో వినియోగదారుల ఖాతాల్లో కేంద్రం జమ చేసే రూ.4 నుంచి రూ.40 (ఇది ప్రాంతాల వారీ మారుతుంది) డెలివరీ ఛార్జీలకూ (అనధికారికమే) చాలదు. వాణిజ్య సిలిండర్ (19 కిలోలు) ధరల్నీ ఇంధన సంస్థలు 6 రోజుల కిందట పెంచాయి. వాణిజ్య గ్యాస్ ధరలూ రాష్ట్రంలో గరిష్ఠంగా రూ.2,530 పైకి ఎగబాకాయి. ఈ పెంపుతో చిన్నచిన్న హోటళ్లను నడిపే చిరు వ్యాపారుల ఆదాయానికీ కేంద్రం గండికొట్టింది. గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ ధరను ఇంధన సంస్థలు మార్చి 20న పెంచాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున భారం వేశాయి. తాజాగా మళ్లీ రూ.50 పెంచడంతో ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.100 పెరిగినట్లయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే... 10.85% పెంచారు.
రాష్ట్రంలో 1.43 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లున్నాయి. ప్రతి నెలా గ్యాస్ తీసుకునే కుటుంబాలు 1.15 కోట్లు ఉంటాయని అంచనా. సిలిండర్‌కు రూ.100 చొప్పున పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే... రూ.115 కోట్ల అదనపు భారం పడుతుంది. 2021 ఏప్రిల్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.831 ఉండగా.. ప్రస్తుతం రూ.1,022 అయింది. ఏడాది వ్యవధిలో రూ.191 చొప్పున భారం పడింది.
వాణిజ్య సిలిండర్‌దీ అదేదారి...: మే 1న వాణిజ్య సిలిండర్ ధరను రూ.102 పెంచారు. ఫలితంగా విజయవాడలో 19 కిలోల సిలిండర్ ధర రూ.2,490కి చేరింది. చిన్న హోటళ్లు నడిపేవారు, రోడ్డుపక్క తోపుడు బండ్లను పెట్టుకునే చిరు వ్యాపారులు ఎక్కువగా వాణిజ్య సిలిండర్లను కొంటారు. గతేడాది నుంచి వీరిపైనా మోయలేని భారం పడింది.
- గతేడాది మేలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,704 కాగా ఇప్పుడు రూ.2,490 అయింది. ఏడాదిలో 46.13 శాతం పెరిగింది. సగటున నెలకు 10 సిలిండర్లు వాడే చిరు వ్యాపారుల ఆదాయం రూ.7,860 మేర తగ్గుతుంది.
- కొన్ని నెలలుగా వంటనూనెలూ మండుతున్నాయి. ఇతర నిత్యావసరాల ధరలూ భారీగా పెరిగాయి. వీటికి వంటగ్యాస్ మంటలు తోడవటంతో... చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. ధరలు పెరిగాయని.. ఆహార పదార్థాల రేట్లు పెంచుదామంటే పోటీ కారణంగా వ్యాపారం సాగదేమో అనే భయం పలువురిలో వ్యక్తమవుతోంది. హోటళ్లలో పని చేసే సిబ్బంది జీతాల చెల్లింపునకూ ఆదాయం రాని పరిస్థితి తలెత్తిందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: సింహాచలం దేవస్థానం ఈవోకు.. ఛార్జ్ మెమో