ఈ ఏడాదిలో కృష్ణా డెల్టాకు నీటి సరఫరా విషయంలో జలవనరుల శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 155.4 టీఎంసీల నీరు ఈసారి కృష్ణాడెల్టాకు వినియోగించాలని నిర్ణయించారు. కృష్ణా డెల్టాలోని కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న 13.07 లక్షల ఎకరాల్లోని పంటల సాగుకోసం ఈ స్థాయిలో నీటి వినియోగం ఉంటుందని జలవనరుల శాఖ భావిస్తోంది. వరి, చెరకు లాంటి ప్రధాన పంటలతో పాటు ఇతర పంటలకూ నీరు అవసరమని అంచనా. ఒక్క పట్టిసీమ నుంచే 80 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా వినియోగించాలని జలవనరుల శాఖ భావిస్తోంది.
ప్రకాశం బ్యారేజి దిగువన ఉన్న కృష్ణా తూర్పు డెల్టాలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న 7 లక్షల 36 వేల 531 ఎకరాలకు, అలాగే కృష్ణా పశ్టిమ డెల్టాలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 5 లక్షల 71 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా రోజుకు 8 వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తుండటంతో బ్యారేజీ నుంచి దిగువన ఉన్న ఏలూరు, బందరు, రైవస్ కాలువలకు, అలాగే గుంటూరు ఛానల్‌కు నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం 378 కిలోమీటర్ల పొడవైన ఈ అన్ని కాలువల వ్యవస్థ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
సాగునీటితో పాటు డెల్టాలోని తాగునీటి అవసరాల కోసం 549 మంచినీటి చెరువులలో ఈ నీటిని నిల్వ చేయనున్నారు. మరోవైపు మొత్తం సాగు నీటి అవసరాల్లో 3.20 టీఎంసీల భూగర్భజలాలు వినియోగించే అవకాశం ఉన్నట్టు జలవనరుల శాఖ అంచనా వేస్తోంది.