ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుపై కైనటిక్ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రతినిధులు.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో చర్చించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రీఛార్జ్ స్టేషన్లు నెలకొల్పడంపైనా కైనటిక్ గ్రీన్ ఎనర్జీ ఆసక్తిగా ఉన్నట్టు వారు మంత్రికి వివరించారు. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల రీచార్జి స్టేషన్ల ఏర్పాటు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశానికి పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ సైతం హాజరయ్యారు.
పలు సంస్థలో ఒప్పందాలు
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కళాశాలల ఏర్పాటుకు సంబంధించి టెక్ మహీంద్రా ఫౌండేషన్, బయోకాన్ లిమిటెడ్, స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఒప్పంద పత్రాలను ఏపీ ప్రభుత్వం- ఆయా సంస్థల ప్రతినిధులు మార్చుకున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈఓ అర్జా శ్రీకాంత్, ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పాఠ్యాంశాల రూపకల్పన, విశాఖలో లాజిస్టిక్స్ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. అటు లైఫ్ సైన్సెస్ లో నాలెడ్జ్ పార్టనర్ గా వ్యవహరించేందుకు బయోకాన్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్నైడర్ సంస్థ ఆసక్తి కనపరిచింది. మరోవైపు 12 నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లోనూ ఆటోమేషన్, ఎనర్జీ మేనేజ్మెంట్ రంగాల్లో స్కిల్ సెంటర్ల ఏర్పాటు కోసం స్నైడర్ ఎలక్ట్రిక్ అంగీకారాన్ని తెలియచేస్తూ ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఇదీ చదవండి: దేవాదాయ శాఖ మంత్రిని, ఇంద్రకీలాద్రి ఈవోను తప్పించండి: చంద్రబాబు