కార్తిక మాసంలో తితిదే తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా మంగళవారం తిరుమల వసంత మండపంలో అశ్వత్థ (రూపవిష్ణు)పూజ, సార్వభౌమ వ్రతం శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వసంతమండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపమని వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు అన్నారు. శ్రీ మన్నారాయణుడికి, అశ్వత్థ వృక్షానికి చతుర్వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సార్వభౌమ వ్రతం నిర్వహించామని తద్వారా వ్యాధి బాధలు తొలుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ సతీమణి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు ఎన్‌ఎకె.సుందరవదనాచార్యులు, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
టెక్కలిలో ఘనంగా కార్తిక మహోత్సాలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కార్తిక మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తిక ఏకాదశి సందర్భంగా పెద్ద బ్రాహ్మణ వీధిలోని జగన్నాథస్వామి ఆలయంలో 56 రకాల ప్రసాదాలు నైవేధ్యంగా పెట్టి పూజలు నిర్వహించారు. రాధామాధవ మఠం పీఠాధిపతి మహంత్ మదన్ గోపాల్ దాస్ జీ మహరాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైభవంగా కోటి దీపోత్సవం
కార్తిక మాసం సందర్భంగా విజయవాడ రామకృష్ణాపురంలో కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. కోడూరు రాజు గారి వీధిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు. సమీప ప్రాంతాల్లోని మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి దీపాలు వెలిగించారు.