నూతలపాటి వెంకట రమణ అనే నేను భారత ప్రధాన న్యాయమూర్తిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగంపట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటాననీ, భారత సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడతాననీ, పూర్తి శక్తి సామర్థ్యాలు, జ్ఞానం, విచక్షణను అనుసరించి నా కార్యాలయ విధులను బాధ్యతాయుతంగా... భయం, ప్రయోజనం, రాగద్వేషాలకు అతీతంగా నిర్వర్తిస్తాననీ ప్రమాణం చేస్తున్నాను.
‘ఎదుగుదల అంటే ఉన్నత పదవీ, హోదా మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మమార్గాన్ని వీడని మనిషిగా ఎదగడం’.. ఎంత గొప్ప మాట ఇది. ఇలా నిర్వచించిన వ్యక్తే స్వయంగా సర్వోన్నత న్యాయపీఠంపై ఆశీనులయ్యారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించారు. అయిదున్నర దశాబ్దాల తర్వాత మరో తెలుగుబిడ్డ ఈ స్థాయికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇప్పటికే ఎన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చిన ఆయన ప్రజల మనసులు చూరగొన్నారు. మహిళలు ఇంటి వద్ద చేసే శ్రమ.. పురుషులు చేసే పనికి ఏమాత్రం తీసిపోదనడం, అంతర్జాలాన్ని ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం చేయడం, పన్నులు విధించే హక్కు రాష్ట్రాలకూ ఉంటుందంటూ వాటి హక్కులకు భద్రత కల్పించడం, మానసిక వైకల్యాన్ని సాకుగా చూపి నేరం నుంచి తప్పించుకోలేరని తీర్పు ఇవ్వడం ద్వారా జస్టిస్ ఎన్.వి. రమణ ప్రత్యేకత చాటుకున్నారు.
న్యాయవాదిగా : 18 ఏళ్లు
హైకోర్టు న్యాయమూర్తిగా: 13 ఏళ్లు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా: 7 ఏళ్లు
జస్టిస్ కోకా సుబ్బారావు అనంతరం 55 ఏళ్ల తర్వాత న్యాయ వ్యవస్థలో అత్యున్నత బాధ్యతలు చేపట్టిన తెలుగు వ్యక్తిగా కీర్తి గడించిన జస్టిస్ రమణ 2022 ఆగస్టు 26వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. తదుపరి రాష్ట్రపతిగా రాబోయే వ్యక్తితో ప్రమాణం చేయించే అవకాశం జస్టిస్ రమణకు వస్తుంది. శనివారం ఉదయం ప్రమాణం చేసిన అనంతరం తనను ప్రధాన న్యాయమూర్తిగా నియమించి, ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతికి జస్టిస్ రమణ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో 1957 ఆగస్టు 27న సాధారణ వ్యవసాయ కుటుంబంలో నూతలపాటి గణపతిరావు, సరోజినీదేవి దంపతులకు జన్మించిన ఆయన.. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని నిజం చేసి మరోసారి తెలుగుజాతి కీర్తిని ఇనుమడింపజేశారు. 38 ఏళ్ల క్రితం న్యాయవాదిగా అడుగుపెట్టిన ఆయన వివిధ ప్రభుత్వరంగ సంస్థల స్టాండింగ్ కౌన్సెల్‌గా, అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. న్యాయవాదిగా సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, కార్మిక, ఉద్యోగ సేవలు, ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో ప్రావీణ్యం సంపాదించారు. 2000 జూన్ 27న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు
చేపట్టారు. అక్కడే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరారు. 2013 సెప్టెంబర్ 2న దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది దేశ రాజధానికి చేరారు. 152 రోజులపాటు ఆ పదవిలో కొనసాగిన అనంతరం 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా 7 ఏళ్ల 66 రోజుల సుదీర్ఘ అనుభవం సొంతం చేసుకున్న తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మహమ్మారి రెండో ఉద్ధృతి ప్రబలమైన తరుణంలో న్యాయస్థానాలు ఆగకుండా కొనసాగించడం ఆయన ముందున్న పెద్దసవాల్. ‘‘కష్టకాలం దృఢమైన వ్యక్తులను తయారుచేస్తుంది. అలాంటి దృఢమైన వ్యక్తులు మంచి కాలాన్ని సృష్టించగలుగుతారని మానవ పరిణామ క్రమాన్ని చెబుతూ స్పానిష్ రచయిత మైఖేల్ హాప్ చెప్పారు. మనం ఇప్పుడు నిస్సందేహంగా కష్టకాలంలో కొనసాగుతున్నాం. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితులు మనం ఇదివరకు ఎన్నడూలేనంత బలోపేతంగా తయారుకావడానికి దోహదపడతాయని నమ్ముతున్నా. అందువల్ల అందరూ దృఢంగా ఉందాం. కలిసికట్టుగా దీన్ని అధిగమిద్దాం’’ అని శుక్రవారం జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే వీడ్కోలు సమావేశంలో జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన అనుసరించే పంథాను వ్యక్తం చేస్తున్నాయి.
కొవిడ్‌పై ఏడుగురు సీనియర్ న్యాయమూర్తులతో కమిటీ
ఈనాడు, దిల్లీ: ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జస్టిస్ ఎన్.వి.రమణ కొవిడ్ పరిస్థితులపై సమీక్షించారు. ఆయన రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి సీనియర్ న్యాయమూర్తులతో చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయస్థాన కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంపై మార్గసూచి తయారు చేయడానికి తన ఆధ్వర్యంలో ఏడుగురితో కమిటీ వేశారు. మళ్లీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలవాలని నిర్ణయించారు.
ఎన్నెన్నో కీలక తీర్పులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న కాలంలో జస్టిస్ ఎన్.వి.రమణ 156కి పైగా తీర్పులు వెలువరించారు. ఇంటర్‌నెట్ ద్వారా వ్యక్తం చేసే అభిప్రాయం భావస్వేచ్ఛ కిందికే వస్తుందని జమ్మూకశ్మీర్ కేసులో ఇచ్చిన తీర్పు ద్వారా ఇంటర్‌నెట్‌ను ప్రాథమిక హక్కులో అంతర్భాగం చేశారు. పన్నులు విధించే హక్కు రాష్ట్రాలకు ఉంటుందని ఇచ్చిన తీర్పు ద్వారా సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకున్న హక్కులకు భద్రత కల్పించారు. మానసిక వైకల్యాన్ని సాకుగా చూపి నేరం నుంచి తప్పించుకోలేరని, దానికి ఆసుపత్రిలో చూపించుకున్న ఓపీడీ కార్డు ఫొటోకాపీ, తల్లి వాంగ్మూలం లాంటివి సరిపోవని, బలమైన ఆధారాలు ఉండాలని చెప్పి నేరగాళ్లు తప్పించుకోకుండా చట్రం బిగించారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గం, స్పీకర్‌లను సంప్రదించకుండా అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరుపుతూ అరుణాచల్ గవర్నర్ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయడం ద్వారా రాజ్యాంగ సూత్రాలకు పట్టం కట్టారు.
తెలుగు ప్రజలకు గర్వకారణం
‘భారత 48వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు శుభాకాంక్షలు. ప్రపంచంలోనే పెద్దదయిన భారత న్యాయవ్యవస్థ పరిరక్షకునిగా తెలుగు వ్యక్తి నియమితులవడం తోటి తెలుగువారంతా ఎంతో గర్వించే విషయం. గతంలో ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన విశిష్ట న్యాయ కోవిదుడు జస్టిస్ కోకా సుబ్బారావు అడుగుజాడలను అనుసరించారు. ఇది మీ అత్యుత్తమ, అసాధారణ న్యాయ ప్రస్థానానికి ప్రతీక. పౌర హక్కులు, పేదలపై సానుభూతి విషయంలో మీ అంకితభావం ఎంతో గుర్తింపు పొందాయి. న్యాయ వ్యవస్థ విషయంలో మీకున్న స్పష్టత, అంకితభావాన్ని న్యాయ వర్గాలు ఎంతో గౌరవిస్తాయి. జీవిత తొలినాళ్లలో పాత్రికేయునిగా మీరు పని చేయడం వల్ల సమస్యలను మరో కోణంలో స్పృశించే అవకాశాన్ని అది కలగజేసిందని నేను భావిస్తున్నాను. రాజ్యాంగ, నేర కేసులు, సేవలు, అంతరాష్ట్ర నదీజలాల చట్టాల విషయంలో మీకున్న అపార పరిజ్ఞానం, అనుభవం తీర్పుల విషయంలో సహకరించడంతో పాటు రాజ్యాంగ నియమాలను బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నాను. నూతన సీజేఐ ఆధ్వర్యంలో త్వరగా న్యాయ సేవలు అందుతాయని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు’- బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్
వేసవి సెలవులను రద్దుచేసి న్యాయవ్యవస్థ నిరంతరం నడిచేలా చూడాలి
‘ప్రస్తుత మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో జస్టిస్ రమణ న్యాయస్థానాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నడపాలి. అంతకుమించిన ప్రత్యామ్నాయం లేదు. ఇలాంటి సమయంలో న్యాయమూర్తులు ఇళ్లనే కార్యాలయాలుగా మలచుకొని పనిచేయాలి. పాత కేసులను, విచారణ తుది దశకు వచ్చిన కేసులను లిస్ట్ చేయకూడదని నోటీసులో పెట్టారు. ఈ కేసులను భౌతికంగా చేపట్టడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. రిజిస్ట్రీలో ఈ కేసులను చాలామంది పరిశీలిస్తారు. అక్కడి ఉద్యోగులంతా నాలుగు గోడల మధ్య, సెంట్రల్ ఏసీలో ఉంటారు కాబట్టి మహమ్మారి దావానలంలా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే 60% మంది రిజిస్ట్రీ సిబ్బందికి కొవిడ్ వచ్చింది. అందువల్ల ఆన్‌లైన్ ద్వారా విచారించడం మేలు. వేసవి సెలవులను రద్దుచేసి ఆన్‌లైన్ ద్వారా కోర్టును నిరంతరం నిర్వహించాలి. హైకోర్టులు కూడా నిరంతరం పనిచేసేలా చూడాలి. ప్రస్తుతం కోర్టులు పనిచేయకపోవడంవల్ల కేసుల విచారణ జరగక చాలామంది న్యాయవాదులు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు.’-దీపక్ నర్‌వార్‌కర్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
సువర్ణాధ్యాయాన్ని లిఖించాలి
‘జస్టిస్ రమణకు మంచి అవకాశం వచ్చింది. 16 నెలలపాటు ఆయన పదవిలో ఉంటారు. ఎక్కువ ఏదో చేయాలని ఆయన మీద భారం పెడితే మనదే తప్పవుతుంది. ఉన్నంతలో రాజ్యాంగ విలువలను రక్షించడానికి కృషిచేస్తారని నేను భావిస్తున్నాను. న్యాయచరిత్రలో ఆయన సువర్ణాధ్యాయాన్ని లిఖించాలని కోరుకుంటున్నాను. అందుకు తగ్గ అవకాశాలు రావాలని కాంక్షిస్తున్నాను. తెలుగు అభిమాని అయిన జస్టిస్ ఎన్.వి.రమణ రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను, పౌరహక్కులను సంరక్షిస్తూ తన పదవీకాలాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాను.’-మాడభూషి శ్రీధర్, కాన్‌స్టిట్యూషనల్ లా ప్రొఫెసర్, బెనెట్ యూనివర్శిటీ.
తెలుగు వారికి గర్వకారణం
‘భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు హృదయపూర్వక అభినందనలు. అమరావతిలోని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కాలేజీలో బీఎస్సీ చదివిన ఆయన దేశ అత్యున్నత న్యాయ పీఠానికి చేరుకోవడం యావత్ తెలుగు వారికి గర్వకారణం.’- జాస్తి వీరాంజనేయులు, అఖిల భారత పంచాయతీ పరిషత్తు జాతీయ కార్యదర్శి
జస్టిస్ రమణకు అభినందనలు: గవర్నర్
‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, హృదయపూర్వక అభినందనలు’ అని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం ట్వీట్ చేశారు.
శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
‘భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు’ అని ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు.
జస్టిస్ రమణకు శుభాభినందన: చంద్రబాబు
‘భారత సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు శుభాభినందనలు’ అని తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.మీ అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరం: కేసీఆర్
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ రమణ విశేష అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదవీకాలం గొప్పగా సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు జస్టిస్ రమణకు అభినందనలతో లేఖ పంపారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పలువురు మంత్రులు జస్టిస్ రమణకు అభినందనలు తెలిపారు.
కేటీఆర్ శుభాకాంక్షలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అభినందనలు తెలిపారు.
న్యాయ క్షేత్రంలో నిత్య కృషీవలుడు: చిరంజీవి
‘‘గత 40 ఏళ్లుగా న్యాయ క్షేత్రంలో నిత్య కృషీవలుడు జస్టిస్ ఎన్వీ రమణ. అత్యున్నత పదవిని చేపట్టిన తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతోంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ ఆయన. సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడాయన’’ అని కేంద్ర మాజీ మంత్రి, సినీ హీరో చిరంజీవి ట్విటర్‌లో కొనియాడారు.హృదయపూర్వక శుభాకాంక్షలు: పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ
భారతదేశంలో అతి కీలకమైన, సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన మన తెలుగు బిడ్డ జస్టిస్ ఎన్.వి.రమణకు అందరి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఇదీ చదవండి: కీలక కేసులు.. చారిత్రక తీర్పులు