రాజధాని అమరావతి రైతుల పాదయాత్రలో పోలీసుల లాఠీఛార్జి అప్రజాస్వామికమని జనసేన పార్టీ పేర్కొంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.
రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలియచేసేందుకు వచ్చిన వారిపై ప్రకాశం జిల్లాలో పోలీసులు లాఠీఛార్జి చేయడం దురదృష్టకరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మద్దతు చెప్పడం, సంఘీభావం తెలియజేయడం ప్రజాస్వామ్యంలో భాగమేనని అన్నారు. అదేమీ నేరం కాదన్నారు. రైతులు చేపట్టిన కార్యక్రమానికి సంఘీభావాన్ని చెప్పేవారిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. ఈ లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయని, ఓ రైతుకు చేయి విరిగినట్లు తమకు సమాచారం అందిందన్నారు. వీరికి అవసరమైన వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు.
ఈ యాత్ర కవరేజి కోసం వెళ్ళిన మీడియాను సైతం పోలీసులు నియంత్రించి- విధులకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. రోడ్లను దిగ్బంధించి, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఏమిటి? ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతోపాటు రైతుల యాత్రను విఫలం చేయడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
FARMERS MAHA PADAYATRA: అమరావతి పాదయాత్రపై లాఠీఛార్జ్.. విరిగిన రైతు చేయి