ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ సరఫరా(cannabis and drugs supply) విచ్చలవిడిగా పెరిగిపోయిందని జనసేన అధికారప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడినా.. మూలాలు ఏపీలో ఉండడం బాధాకరమన్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసు అధికారుల మీడియా సమావేశంలో పట్టుబడ్డ గంజాయి, డ్రగ్స్ మూలాల ఏపీలో ఉన్నాయని చెబుతున్నారని, దీనిపై డీజీపీ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. మాదక ద్రవ్యాల సరఫరా అడ్డుకోవాల్సిన జగన్ ప్రభుత్వం.. చోద్యం చూస్తోందని మండిపడ్డారు. డ్రగ్స్ మాఫియాతో ఉత్తరాంధ్ర డాన్ విజయసాయిరెడ్డికి లింకులున్నాయన్న అనుమానం వ్యక్తం అవుతోందన్నారు.
పొరుగు రాష్ట్రాల ముందు పరువుపోతోంది..
గంజాయి రవాణా(cannabis and drugs supply) విశాఖ కేంద్రంగా విచ్చలవిడిగా సాగుతోందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ అన్నారు. గంజాయి రవాణా కారణంగా పొరుగు రాష్ట్రాల ముందు మన రాష్ట్రం పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో గంజాయి కేసులు కన్నా, ఇక్కడి నుంచి రవాణా అయిన గంజాయికి సంబంధించి.. ఇతర రాష్ట్రాలలో నమోదవుతున్న కేసులు అధికంగా ఉన్నాయన్నారు. ఉపాధి కోసం గిరిజనులు గంజాయి ఉచ్చులో చిక్కుకొని నేరస్తులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గోడ పత్రికల ఆవిష్కరణ..
విశాఖపట్నంలో ఈ నెల 31న జరగనున్న భారీ బహిరంగ సభకు జనసేన శ్రేణులు తరలిరావాలని రాష్ట్ర కార్యదర్శి, నరసరావుపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ పిలుపునిచ్చారు.కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజావ్యతిరేఖ విధానాలకు నిరసనగా 'ఛలో విశాఖపట్నం' పేరుతో గోడ పత్రికలను ఆవిష్కరించారు. విశాఖ ఉక్కుపరిరక్షణ కోసం ఈనెల 31న లక్షలాది మందితో పార్టీ అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) మద్దతు ఇవ్వనున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి